“చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాజధాని, చుట్టుపక్కల భూములకు ప్రాధాన్యమిచ్చారు. సగటు ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. అందుకే కదా వైసీపీకి అధికారమిచ్చింది ! వీళ్లేమో నవరత్నాల జపం తప్ప జనం గోడు పట్టించుకోవడం లేదు. గుడ్డెద్దు చేలో పడ్డ సామెతగా వ్యహరిస్తున్నారు. మీలాంటోళ్లు కూడా జగన్ ను ఆహా ఓహో అంటూ కీర్తించడం ఏంబాగలేదు !” అంటూ వరసకు మామ అయిన పెద్ద మనిషి అసంతృప్తి వ్యక్తం చేశాడు. నేనేదో చెప్పబోతే “పో ప్పోవాయ్ బూషడీకే ”అన్నాడు. వెంటనే నాలిక్కరుచుకున్నాడు. ఆయన వాదనకు ఎవరైనా అడ్డుపడితే పోవాయ్ బూషడికే అనడం ఆయనకు అలవాటు. రచ్చబండ దగ్గర చర్చల్లో తమ వాదనలను వ్యతిరేకించే వాళ్లపై చిరుకోపం ప్రదర్శించడానికి ఈ పదం వాడుతుంటారు. సీఎం జగన్ ఆ పదానికి చెప్పిన అర్థంతో ఆయన నిన్నటి నుంచి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదట. నోరు జారి ఎవర్ని బూషడికే అంటే ఎలా రియాక్ట్ అవుతారోనని తెగ మదనపడుతున్నాడు.
సీఎం జగన్ నిన్న ఆ పదం పచ్చి బూతుగా చెప్పడంతో దీనిపై గ్రామాల్లో అరుగుల దగ్గర చర్చనీయాంశమైంది. తెలుగు నిఘంటువులు పెట్టుకొని అర్థాలు వెదకడం లేదు. ఆయనకు ఇలా అర్థం వస్తుందని చెప్పిన పండిత పామరుల గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అరడజను మంది సలహాదారులున్నా ఇదేం ఖర్మని అనుకుంటున్నారు. లేక కావాలనే బూతు పదంగా అల్లేశారా అని గుసగుసలాడుకుంటున్నారు. కేవలం టీడీపీ నేత పట్టాభిని కేసులో ఇరికించడానికి ఇదంతా చేశారా అని సందేహిస్తున్నారు. ఈ మాట అన్నందుకే జగన్ అభిమానులకు బీపీ పెరిగి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. మరి మద్యం షాపుల దగ్గర తిట్లు వింటే వాటిని ఏం చేస్తారా అని ఊహించుకుంటున్నారు. మరి మంత్రులు చంద్రబాబుపై సంధిస్తున్న తిట్ల దండకానికి టీడీపీ అభిమానులు కూడా బీపీ పెంచుకుంటే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
రాష్ర్టంలోని అధికార, ప్రతిపక్షాలు ప్రజల సమస్యలు వదిలేసి ఇలా వ్యక్తిగత దూషణలతో దాడులు, కేసులు, నిరసన దీక్షలు చేపట్టడంపై జనం ఔరా అంటూ నోటి మీద వేలేసుకుంటున్నారు. సీ ఓటర్ సర్వేలో దేశం మొత్తంగా సర్వే చేస్తే అత్యధికంగా ఏపీ ఎమ్మెల్యేలపై 28.8 శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు పేర్కొంది. కూటికి లేనోడికి ఎమ్మెల్యే దగ్గర పనుల కోసం వెళ్లే పరిస్థితి ఉండదు. మధ్య తరగతి, సంపస్న వర్గాల్లోనే ఈ వ్యతిరేకత నెలకొని ఉంటుంది. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చి సానుభూతి కోసం సీఎం జగన్ తో అలా మాట్లాడించి ఉంటారనేది జనంలో నానుతోంది. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తన పర్యటనలో టీడీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై టీడీపీ ముందు వరుసలో నిలబడి పనిచేసే పరిస్థితి లేదన్నారు. వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పారు. ప్రజల్లో తాము వెనుకబడ్డామని టీడీపీ భావించినట్లుంది. ఏదోరకంగా ప్రజల సానుభూతి పొందడానికి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ వైసీపీ నేతలను తాట వలుస్తామన్నారు. ఎందుకో అప్పుడు ఎవరికీ బీపీ పెరగలేదు. టీడీపీ నేతల మాటలకు మాత్రమే బీపీ పెరిగి కోపం వస్తుందా ! అయితే ఓకే. మిగతా వాళ్లంతా ఊపిరిపీల్చుకోవచ్చు.