ఇప్పుడేం జరగబోతోంది ! సగటు ప్రజల్లో ఇదే చర్చ. చంద్రబాబు బృందం రాష్ర్టపతికి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది ? వైసీపీ సర్కారుపై కేంద్రం ఏవైనా చర్యలకు పాల్పడుతుందా ! లేక టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తుందా అనే అంశాలపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీ విషయంలో ఉస్కో.. ఇజ్జూ అంటూ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇటు జగన్ ప్రభుత్వానికి సహకరిస్తున్నట్లే ఉండాలి కానీ వైసీపీ బలపడకూడదు. వీలైతే చంద్రబాబుకూ చేయి అందించాలని భావిస్తోంది. అధికార ప్రతిపక్షాల రగడపై కేంద్ర పెద్దల వ్యూహం ప్రకారం ఏదైనా జరగొచ్చు.
ప్రతిపక్ష టీడీపీ నేతల బృందానికి రాష్ర్టపతి అపాయింట్మెంటు ఖరారైంది. సుమారు 18 మంది నేతలతో చంద్రబాబు బృందం సోమవారం రాష్ర్టపతి రామనాధ్ కోవింద్‌ను కలవనున్నారు. రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేయనున్నారు. విపక్ష నేతలపై అక్రమ కేసులు, పార్టీ కార్యాలయాలపై దాడుల గురించి నివేదిస్తారు. ఆర్టికల్ 356ను విధించాలని కోరనున్నారు. జరిగిన ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్రపతికి విన్నవిస్తారు. ఇంకా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ర్ట పరిస్థితుల గురించి నివేదించడానికి టీడీపీ బృందం సమాయత్తమవుతోంది.
మరోవైపు విశాఖ పర్యటనను రద్దు చేసుకున్న సీఎం జగన్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. జనాగ్రహ దీక్షలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తోంది. తాము కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర సర్కారుకు ఏం జరిగిందనేది వివరణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈపాటికే కేంద్రం నిర్ణయాలను తూచా తప్పకుండా రాష్ర్టంలో అమలు చేస్తున్నా పోలవరం నిర్మాణానికి సహకరించడం లేదు. అప్పు కోసం వెళ్లినప్పుడల్లా కేంద్రం ఏదో మెలిక తగిలిస్తూ వచ్చింది. విద్యుత్ పంపిణీని ప్రైవేటుకు అప్పజెప్పేందుకు రంగం సిద్దం చేసింది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తోంది. పోర్టులను అదానీకి అప్పగించింది. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులను బేరం పెట్టినా కిక్కురమన్లేదు. చివరకు స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నా నిలదీయలేని దుస్థితిలోకి జారిపోయింది. ప్రస్తుతం ఆర్థిక సమస్యల సుడిగుండంలో రాష్ట్ర సర్కారు కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ ఫిర్యాదులను ముందుపెట్టి కేంద్రం బేరసారాలకు దిగే అవకాశముంది. ఇంకా కేంద్ర నిర్ణయాలను రాష్ర్టంలో అమలు చేయాల్సినవి మిగిలి ఉంటే వాటికి లింకు పెట్టనూ వచ్చు. లేదా ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తులను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఫిర్యాదులకు అనుకూలంగానూ స్పందించవచ్చు.