రాజకీయాల్లో ఎత్తుగడలను లోతుగా అర్థం చేసుకోలేకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి. విపక్షం రెచ్చగొడుతుంది. రెచ్చిపోతే అధికార పక్షానికే బొక్క పడుతోంది. ఇక్కడ అదే జరిగింది. టీడీపీ నేత సీఎం జగన్‌ను దుర్భాషలాడారు. జగన్ అభిమానులు రెచ్చిపోయి ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ అధినేత 36 గంటలపాటు చేసిన నిరసన దీక్ష ఫలితాలనిచ్చింది. పార్టీలో లొసుగులను రూపుమాపి ఏకతాటిపైకి తెచ్చింది. పట్టాభి అన్న పదానికి సీఎం జగన్ విపరీత అర్థం చెప్పినా, జనాగ్రహ దీక్షలు చేపట్టినా పెద్దగా ఒనగూడిందేమీ లేదు.
టీడీపీ కార్యాలయాలపై దాడిని ఆపార్టీ ముందుగానే ఊహించినట్లు కనిపిస్తోంది. వైసీపీ దుందుడుకు చర్యలతో విపక్షనేత చంద్రబాబు గ్రాఫ్ పెరిగింది. అలిగిన బుచ్చయ్య చౌదరి సమరోత్సాహంతో కదిలారు. ఎడమొహం పెడమొహంగా ఉన్న కేశినేని నాని జెండా చేబూని కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇప్పటిదాకా తన వ్యాపారాలకే పరిమితమైన సుధీర్‌రెడ్డి పార్టీ యంత్రాంగంలో కదలిక తెచ్చారు. మొత్తంగా వివిధ జిల్లాల్లో గ్రూపులతో సతమతమవుతున్న తెలుగు తమ్ముళ్లను చంద్రబాబు నిరసన దీక్ష ఏకం చేసింది.
ఇక వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలపై ప్రజల్లో అంతగా స్పందన కనిపించలేదు. కార్యకర్తలతో దీక్షలు కొనసాగాయి. ఇక్కడ జనం ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేయాలి ? ఎందుకు కోపం తెచ్చుకోవాలి.. అనే ప్రశ్నలు తలెత్తాయి. టీడీపీ నేతలు తప్పు చేస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునే స్థానంలో వైసీపీ ఉంది. ఈమాత్రం దానికి వాళ్ల పార్టీ కార్యాలయంపై దాడి చేయాల్సిన అవసరం ఏమిటనే గుసగుసలు వినిపించాయి. సీఎం జగన్ స్థానంలో తమిళనాడు సీఎం ఉంటే ఏం చేసేవారంటే.. నేరుగా చంద్రబాబు నిరసన దీక్ష వద్దకెళ్లి నిమ్మరసం ఇచ్చి విరమింపజేసేవారు. తన అభిమానుల తరపున సారీ చెప్పి టీడీపీ శ్రేణులతో శబ్బాష్ అనిపించుకునేవారు. అలా చేసి ఉంటే టీడీపీ మరింత బలహీనపడి వైసీపీ బలపడేదనేదని ఆపార్టీ వర్గాల్లో చర్చ కొనసాగింది. ఏమైనా టీడీపీ నేతలు వైసీపీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.