కేంద్రంపై వ్యతిరేకత రాష్ట్రానికీ తగులుతోంది
వైసీపీ సర్కారు కళ్లు తెరవకుంటే కొంపమునిగినట్లే
మిగతా ప్రధాన పక్షాలకూ నిరసన సెగ
నిధుల కోసం కేంద్ర సర్కారుతో లాబీయింగ్ చేయొచ్చు. ఎంతకాలమిలా అనేదే ముఖ్యం. కేంద్రం ప్రజల మూలిగలు పీలుస్తుంటే నోరు మెదపరా ? రూ.30 పెట్రోలును రూ.115 చేస్తే ప్రశ్నించలేరా ! పాతిక రూపాయల విలువ చేయని డీజిల్‌ను వందకుపైగా పెంచి జనం జేబులు కొడుతుంటే మాట్లాడరా ! గడచిన 18నెలల కాలంలో సామాన్యుడి వినియోగించే వంటగ్యాస్ రూ.300 పెంచితే ఇదేంటని నిలదీయలేరా ! పెరుగుతున్న నిత్యావసరాల ధరలతకు జనం బెంబేలెత్తుతుంటే రాష్ర్ట ప్రభుత్వం బేలగా చూస్తుండిపోతోంది.థ పోలవరం బిల్లులకు కొర్రీలు వేస్తూ 2013కు ముందున్న అంచనాల ప్రకారమే నిధులిస్తామంటున్నారు. ఇప్పటి అంచనాకు సగానికిపైగా వ్యత్యాసం ఉంది. ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారు ! గతంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న అత్యధిక ధరలతోనే ఒప్పందాలను కొనసాగించాలని హుకుం జారీ చేస్తే తలొగ్గుతారా ! పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులను అమ్మేస్తుంటే కిక్కురుమనడం లేదు. దీన్ని లాబీయింగ్ అనరు. మోకాళ్లపై మోకరిల్లడం అంటారు. పొయ్యి సెగ పొంతకూ తగలకమానదు.
ఇక్కడ అధికార వైసీపీ కేంద్రం అడుగులకు మడుగులు వత్తడం ఆ పార్టీకి అనేక విధాలుగా ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగులుతుంది. ముస్లిం మైనార్టీలు దూరమవుతున్నారు. పెంచిన రైల్వే చార్జీలు, నిరంతరం పెరుగుతున్న కరెంటు చార్జీలతో రాష్ర్ట సర్కారు మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. ప్రజల అసంతృప్తిని ఏ నవరత్నాలూ తగ్గించలేవు. అన్ని వేళలా ప్రజల ఆక్రోశాన్ని పక్కదారి పట్టించలేరు. కులాలు, సెంటిమెంట్లుతో ఎంతో కాలం నెట్టుకురాలేరు. ఈసంగతి వైసీపీ పెద్దలకు అవగతమవుతుందో లేదో !
గడచిన ఏడేళ్లలో కేంద్ర సర్కారు సగటు ప్రజలపై పెనుభారాలు మోపుతోంది. 2014-15లో రూ. 2.6 లక్షల కోట్లున్న ఆదాయపన్ను రాబడి ప్రస్తుతం రూ. 5.6 లక్షల కోట్ల కు పెరిగింది. కార్పొరేట్ల నుంచి వసూలయ్యే పన్ను 30 నుంచి 22 శాతానికి తగ్గింది. ఉద్యోగులను తగ్గిస్తూ కొత్తగా ఉపాధి కల్పించకున్నా రూ.6 లక్షల కోట్ల రాయితీలిచ్చి మరింత కుబేరులను చేసింది. సంపన్నులు వినియోగించే విదేశీ వస్తువులపై రూ.5 లక్షల కోట్ల కస్టమ్స్ డ్యూటీ మినహాయింపునిచ్చింది. కరోనా కష్టకాలంలోనూ పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలపై భారీగా ఎక్సైజ్ సుంకం విధించి ప్రజల నడ్డివిరిచింది.
ఇంత నగ్నంగా కొనసాగుతున్న కేంద్ర సర్కారు దోపిడీపై రాష్ర్టంలోని ప్రతిపక్ష టీడీపీ, జనసేనకు నోరు పెగలడం లేదు. పనికిమాలిన భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొడుతూ కేంద్రం వద్ద సాగిలపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం లోని బీజేపీకి రాష్ర్టంలో ఊడేది లేదు.. పోయేది లేదు. విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకాన్ని నిరసిస్తూ జనసేనాని ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఇదీ కేంద్ర పెద్దల ఆమోదంతో చేసే ఉత్తిత్తి ఉద్యమమేనా.. గట్టిగా నిలదీస్తారా అనేది చూడాలి. చివరకు మీకన్నా కేఏపాల్ వెయ్యి రెట్లు బెటరనే దశకు రాష్ర్ట ప్రజలు ఆలోచించేదాకా వెళ్తారేమో !