ఉచిత పథకాలతో బడుగులకు దోచిపెడుతున్నారనే అపోహలు
ఎస్సీఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ కార్పొరేషన్లు నిర్వీర్యం
కులాల కార్పొరేషన్లకూ నిధుల్లేవ్
సబ్ ప్లాన్ నిధులూ నవరత్నాలకే
అగ్రవర్ణాల పేదలను వైసీపీ సర్కారుపైకి ఎగదోసేందుకే ఈ వార్తా కథనాన్ని వండి వార్చినట్లుంది. సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ఎంపికలో పదిశాతం ఎకనమికల్లీ వీకర్ సెక్షన్(ఈడబ్ల్యూఎస్)కు కేటాయించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. దీనికన్నా ఎక్కువగా బడుగుల సంక్షేమ బడ్జెట్ నిధులన్నీ ప్రభుత్వం నవరత్నాలకు మళ్లిస్తోంది. సచివాలయ ఉద్యోగాల ఎంపికలో జరిగిన నష్టం కన్నా అగ్రవర్ణాలకు ఎన్నో రెట్లు నవరత్నాల ద్వారా లబ్ది చేకూరుతోంది. ఎస్సీఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. వాటి నిధులనూ నవరత్నాల అమలుకే కేటాయిస్తున్నారు. చివరకు సబ్ ప్లాన్ నిధులకూ నవరత్నాల గ్రహణం పట్టింది. కేవలం ఆ రత్నాలతోనే ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తారని పాలక ప్రభుత్వం భావిస్తోంది. ఉచిత పథకాలతో బడుగు జనాన్ని సోమరిపోతులను చేస్తున్నారని అగ్రవర్ణాల్లో అపోహలకు దారితీసింది. తాము చెల్లించే పన్నులతో ఇలా విచ్చలవిడి పథకాలేంటనే ఉక్రోషం నెలకొంది. మరోవైపున కేవలం తమకు మాత్రమే కేటాయించాల్సిన నిధులను నవరత్నాల పేరుతో ప్రజలందరికీ పంచడాన్ని బడుగులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మొత్తం రూ.2.3 లక్షల కోట్ల రాష్ర్ట బడ్జెట్లో జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీల సంక్షేమానికి ఎంత ఖర్చుపెడుతున్నారని బడుగులు ప్రశ్నిస్తున్నారు. బీసీ కులాల కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదనే అక్కసు వెళ్లగక్కుతున్నారు. 17 శాతంగా ఉన్న ఎస్సీలు సైతం తమ సంక్షేమ నిధులను ఇతర పథకాలకు మళ్లించడమేంటని నిలదీస్తున్నారు. ఎస్టీల్లోనూ ఇదే అసంతృప్తి నెలకొంది. చివరకు సబ్ ప్లాన్ నిధులనూ ప్రభుత్వం దారి మళ్లించింది. ముస్లిం మైనార్టీలకు గతంలో ఉన్న పథకాలనూ ఎత్తేశారు. మైనార్టీ కార్పొరేషన్ నిధులనూ ప్రభుత్వం ఇతర పథకాలకు వాడేస్తోంది. జనాభాలో 70 శాతానికిపైగా ఉన్న తాము చెల్లిస్తున్న పన్నులెంత ! మా తలలను తాకట్టుపెట్టి తెస్తున్న అప్పులెంత ! మాకు తిరిగి ప్రభుత్వం ఖర్చుపెడుతున్నదెంతనే చర్చ బడుగుల్లో మొదలైంది.
నవరత్నాల్లో ఎవరికి ఎన్ని రత్నాలు అందుతున్నాయంటే..
అందరికీ : రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, రాయితీ యంత్రాల పథకం, అమ్మ ఒడి, ఆసరా, పూజారులు, లాయర్లకు గౌరవ వేతనం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, తల్లీబిడ్డా సంక్షేమానికి ప్రసూతి పథకం, సంపూర్ణ పోషణ, గోరు ముద్ద, పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ,, ఆటో డ్రైవర్లకు నగదు, దర్జీలకు నగదు, వీధి వ్యాపారులకు వడ్డీ రాయితీ రుణం. ఇలా మొత్తం 18 పథకాలు అమలవుతున్నాయి. పదెకరాల్లోపు భూ యజమానులకు, కూటికి లేని పేదలకూ ఈ పథకాలను వర్తింపజేస్తున్నారు. పాతిక ఎకరాలున్న ధనిక రైతుల కుటుంబాల్లో చిన్నారులతో సహా కుటుంబ సభ్యులంతా చిన్నసన్నకారు రైతుల కిందే ఉంటారు.
అగ్రవర్ణాలకు మాత్రమే : ఈబీసీ నేస్తం, కాపు నేస్తం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే : మత్స్యకారులకు ఉచిత నగదు, చేనేతలకు నగదు, రజక, నాయీబ్రాహ్మణులకు నగదు పథకం, వైఎస్సార్ చేయూత, పాస్టర్స్, ముల్లాలకు గౌరవ వేతనం, రేషన్ సరకుల పంపిణీ వాహనాలు.
ఇప్పుడు చెప్పండి. జనాభాకు తగ్గట్టు లబ్ది పొందుతున్నారా ! ఈ పథకాలతో పేదలు దారిద్ర్య రేఖను దాటగలరా !