విద్యా, వైద్య రంగాల్లో కార్పొరేట్ పెత్తనాన్ని కొనసాగిస్తారా !
పథకాలన్నీ కార్పొరేట్ శక్తులను బలోపేతం చేయడానికేనా !
‘నాడు– నేడు’తో లక్ష్యాన్ని చేరుకుంటారా ?
సీఎం వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టే నాటికి ఏపీ ప్రజలు ఆయన్నుంచి చాలా ఎక్కువగానే ఆశించారు. అంతకముందు టీడీపీ పాలనలో విద్య, వైద్యం ప్రజలకు తలకుమించిన భారంగా మారాయి. వీటి కోసం అప్పులపాలవడం లేదా ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జగన్ పాదయాత్రలో ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీలతో కార్పొరేట్ శక్తుల పీడ విరగడవుతుందని భావించారు. రెండున్నరేళ్లు గడిచాయి. ఇప్పటికింకా పురిటి నొప్పుల నుంచి బయటపడలేదు. ఈ రెండు రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు కార్పొరేట్ శక్తులు బలోపేతం కావడానికి తోడ్పడుతున్నట్లు అవగతమవుతోంది.
సుమారు ఏడాదిన్నర క్రితం నాడు–నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇందుకోసం తొలిదశలో రూ.15,337 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి పీహెచసీ, సీహెచ్‌సీ, జిల్లా కేంద్రాల్లోని సర్వజనాస్పత్రుల్లో నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. ఇటీవలనే 43వేలకు పైచిలుకు పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేనందున కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి ఆరోగ్యశ్రీ కింద నిధులు వెచ్చించారు. వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా ప్రజలను ఇటువైపు మళ్లించడంలో ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తోంది. ప్రభుత్వ వైద్య సేవలపై ఆశించిన స్థాయిలో విశ్వాసాన్ని పెంపొందించలేకపోయింది. రూ. 8 వేల కోట్లు అప్పు చేసి కొత్తగా 16 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రాల్లో కార్పొరేట్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి భూముల కేటాయింపు దగ్గర నుంచి అనేక రాయితీలు ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకు మరింత ధర చెల్లిస్తోంది. వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నప్పుడు ప్రజలను అటువైపు మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇంకోవైపున కార్పొరేట్ శక్తులను ఈ రంగంలో నిరుత్సాహపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇంతకీ ప్రభుత్వ వైఖరి ఎటువైపనేది అర్థంగాకుండా ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.
నాడు–నేడు కింద తొలిదశలో రూ.16 వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారు. బడి వాతావరణాన్నే మార్చేశారు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా పాఠశాల విద్యలో పెనుమార్పులు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాదిరిగా ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. వీటిపై ఉపాధ్యాయులు, మేథావుల్లో భిన్నాభిప్రాయాలున్నా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ నోవేకెన్సీ బోర్డులు చూస్తున్నాం. దీన్నిబట్టి పిల్లల తల్లిదండ్రుల ఆలోచనల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పటిదాకా అమ్మ ఒడి పథకంతో చాలా ప్రైవేటు పాఠశాలలు గట్టెక్కాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకూ వెన్నుదన్నుగా నిల్చింది. ఈరంగంలో కార్పొరేట్ శక్తులను నిలువరించాలంటే అమ్మ ఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే వర్తింపజేయాలి. తమిళనాడులో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదవాలనే నిబంధన విధించాలి. ఇవన్నీ చేయకుండా తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రాదు. ఇంతకీ ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలను కాపాడుతుందా లేక ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తుందా అనేది స్పష్టతనివ్వాలి. గత ప్రభుత్వం ఓ విద్యా వ్యాపారికి ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టి తాము కార్పొరేట్ శక్తులవైపేనని చెప్పకనే ప్రకటించుకుంది. మరి వైసీపీ ప్రభుత్వ వైఖరేంటీ !