ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందనేది మనందరికీ తెలిసిందే. ప్రజలకు అందే సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందకపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీ తన వాణిని వినిపిస్తుంది. ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ వ్యూహాత్మకంగా ప్రజల మెప్పు కోసం విపక్ష నేతలు తహతహలాడుతుంటారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు (లబ్ది) కోసం పునాదులు వేసుకుంటూ ప్రజలు హర్షించే విధంగా రాజకీయ చతురతను ప్రదర్శిస్తుంటారు. రాజకీయ చదరంగంలో పావులు కదుపుతుంటారు. ప్రజల యోగ క్షేమాలను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంకన్నా ప్రతిపక్షానికే బాధ్యత ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుత రాజకీయాల్లో వింత పోకడలు జుగుప్సను కలిగిస్తున్నాయి. ఆందువల్ల అధికార పార్టీగాని, ప్రతిపక్ష పార్టీలుగానీ ప్రజల మనోభావాలను మెప్పించలేక పోతున్నాయి అనేది అక్షర సత్యం. ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను పక్కన పెడుతున్న నేతలు తమ పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకోవడమే ప్రధానాంశంగా పెట్టుకున్నారు. తద్వారా ఎవరికి వారే రాజకీయంగా లబ్ది పొందాలనే తపన ఎక్కువైంది. ప్రధానంగా ప్రభుత్వం చేసే అభివృద్ధిని స్వాగతించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసి ప్రతిపక్షం విజయం సాధించాలనే అక్కసుతో న్యాయస్థానాల్లో కేసులు వేస్తోంది. ప్రజల్లో ఆపార్టీ తమ ఉనికిని కోల్పోతుందనే విషయాన్ని కూడా గ్రహించకపోవడం దురదృష్టం. ప్రభుత్వం కూడా తాము చేసేపని చిత్త శుద్ధితో చేయాలని కాకుండా సలహాదారుల సహకారం లేకుండా, కోర్టు ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా, వాటిని సాధించే దిశగా కోర్టుల్లో పోరాడుతున్న సందర్భాలు శూన్యమే. మేము సంక్షేమ ఫలాలు ఇస్తున్నాం. ప్రతిపక్షం కోర్టులద్వారా అడ్డుకుంటుందనే మిషతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప మనం చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయంలో చిత్తశుద్ధి లోపించింది. క్షేత్రస్థాయి పరిశీలన కొరవడింది. ఉదాహరణకు వృద్ధాప్య , వితంతు పెన్షన్లు ఒకసారి వచ్చిన తర్వాత వారికి ఇచ్చే ఆర్ధిక సాయాన్ని అర్హత ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో నిలిపివేయడం ఎంత దారుణం ? అలాగే ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సెంటు స్థలం విషయం కూడా. అసలు ఏమీ లేని వాడికి ఉండేందుకు ఏదో ఒక గూడు కల్పించడం తప్పా ! ఇలాంటి ప్రజాప్రయోజన వాజ్యాలను కోర్టు ఎలా అనుతిస్తుందో అర్దం కావడం లేదని ప్రజలు బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. పొల్యుషన్ పేరుతోనో, మరో పేరుతోనో ఉచితంగా ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకుంటుంటే వాటిని కోర్టు ద్వారా ఆపేయడం ప్రతి పక్షానికి తగునా? ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపేసినా..ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాంతాడంత.
ప్రస్తుతం రాజకీయ నేతలు ప్రజల యోగ క్షేమాన్ని కాకుండా నేను ప్రధాన నేత దృష్టిలో పడుతున్నానా లేదా! అలా ఆయన దృష్టిలో పడాలంటే నేనెలా మాట్లాడాలి? అది ఎలాంటి భాషయినా సరే విచక్షణ మరిచి ఉపయోగిస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా అధినేత దృష్టిలో పడాలి. తద్వారా మంచిగా తను అనుకున్న పనులన్నీ చేయించుకోవాలి. (ప్రజలకు సంబంధించినవి కాదు). వ్యక్తిగతంగా లబ్దిపొందే ప్రయోజనాలు మాత్రమే ప్రధానాంశంగా రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో ఒక నాయకుడిపై విమర్శ చేయాలంటే అందుకు తగిన అర్హత, సామర్థ్యం గల వ్యక్తిని ఎంచుకునే వారు. అలాంటి వారే ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చేది.
ఇప్పుడు అలా కాదు. ఎక్కడ మైక్ కనపడితే అక్కడ వారు చేసే విమర్శలు జుగుప్సాకరంగా తయారయ్యాయి. నేతల మాటలు వింటుంటే ప్రజల్లో ఉన్న చైతన్యం పూర్తిగా నశించిపోతోంది. కూరగాయలు ధరలు పెరిగాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. పెట్రోలు, డీజిల్ రేట్లయితే ఇక చెప్పలేం. కనీవినీ ఎరుగని రీతిలో కొండెక్కి కూర్చున్నాయి. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు ఏ పార్టీకీ పట్టదు. అప్పుడప్పుడూ వారికి నాయకులకు గుర్తొచ్చినా ప్రజలు ఎవ్వరూ స్పందించరు. నేతలు చేసే పనిలో చిత్తశుద్ధి లేదని ప్రజలకు అర్థమవుతోంది. ఓటేసినప్పుడు నోటిస్తే చాలు. తర్వాత మనల్ని వాళ్లు పట్టించుకోరు. వాళ్లని మనం పట్టించుకోవల్సిన అవసరం లేదు అనే ధోరణిలో అందరూ కొనసాగుతున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి నాయకుడు రాజకీయాలను వదిలేసి ప్రతిదాడులకు దిగుతూ బూతులు లంకించుకుంటున్నారు. ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రయోజనాలు పొందాలని చూడటం సరికాదు. అందుకు ప్రజలు స్పందించరనే విషయం మొన్న పట్టాభి, టీడీపీ దీక్ష ద్వారా నాయకులకు అవగతమైంది. అధికార పక్షం చేపట్టిన ప్రజాగ్రహ దీక్షలకు కూడా ప్రజలనుంచి స్పందన లేకపోవడం పార్టీలు గుర్తించాయనే అనుకోవాలి. పట్టాభి ఏమన్నాడనే విషయం తనకు తెలియదని, ఎవరినైనా అలాంటి మాటలు అనకూడదు, ఆమాటను మేము వెనక్కి తీసుకుంటున్నాం. అదే అదునుగా తీసుకుని దాడికి పాల్పడటం ప్రత్యామ్నాయం కాదని చంద్రబాబు అంటే ఎంతో హుందాగా ఉండేది. అదేమాట ఎవరిని అన్నారో తెలుసుకోకుండా నాయకులు చెప్పారు కాబట్టి నన్ను మా అమ్మను ఇలా అనడం సరికాదని సీఎం సభా వేదికపై వాపోవడం చూస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా అల్లరి చేసుకోవడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.
ఆతర్వాత ఢిల్లీ పరిణామాలు మనందరికీ తెలిసిందే. ఎన్నికలకు రెండన్నర ఏళ్ల సమయం ఉంది కాబట్టి విపక్ష నాయకుడు ఊతకర్ర కోసం యత్నించకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడితే ప్రజాహృదయాలను గెలుచుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీర్చేస్తామని అనడం రాజకీయ నాయకులకు సరికాదు. ప్రతీకారం, బదులు తీర్చుకోవడం కాకుండా ప్రజల మన్నన కోసం పని చేయాలి. ఇప్పటికైనా అవకాశవాద రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల పక్షాన నిలిచే పోరాటాలు చేస్తేనే ఏ పార్టీకైనా మనగడ ఉంటుంది. అలా కాని పక్షంలో పార్టీ గుర్తులు సైతం గల్లంతయ్యే ప్రమాదాన్ని గుర్తెరగాలి. ప్రతిపక్షం వ్యూహంలో సంయమనం మరిచి అధికార పక్షం కూడా తన హుందాతనాన్ని కోల్పోతోంది. ప్రభుత్వమంటేనే సంక్షేమం. ప్రజా సంక్షేమానికి అడ్డు తగలకుండా ప్రతిపక్షం కూడా బాధ్యతతో వ్యవహరించాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేట్లు వ్యవహరించకూడదు. విధానాల్లో లోపాలు తెలియజేస్తే ప్రజలూ హర్షిస్తారు. రాజకీయ నాయకులారా ఆలోచించండి.
– కొండా రాజేశ్వరరావు
సీనియర్ జర్నలిస్టు
ధన్యవాదాలు సార్
welcome