కేంద్రం పెట్రో ధరలు తగ్గించింది
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యాట్ కుదింపు
తెలుగు రాష్ట్రాలే పట్టీపట్టనట్టున్నాయి
మొన్నటి దేశ వ్యాప్త ఉప ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. పెట్రోలుకు రూ.50 పెంచినా లీటరుకు రూ.5 తగ్గించింది. డీజిల్పై పది రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి తగ్గింపు ధరలు వర్తిస్తాయని పేర్కొంది. ఈలోగా బీజేపీ పాలిత పది రాష్ట్రాల్లోనూ రూ.2 నుంచి రూ.12 దాకా వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం చమురు ధరలు తగ్గించినా ప్రజలకు కొంత ఊరట కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లో స్పందన కనిపించలేదు. తామెందుకు తగ్గించాలని బిర్రుగా బిగుసుకున్నాయి.
వాజ్పేయి హయాంలోనే చమురు రంగంలో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఓ ఫండ్ ఏర్పాటు చేస్తామని నాటి బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. దాని ఊసే లేదు. తర్వాత అంతర్జాతీయంగా ధరలు తగ్గితే ఆయిల్ రేట్లు తగ్గించడం, పెరిగితే పెంచడమనే విధానాన్ని తీసుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చమురు ధరలు ఒక రూపాయి పెంచాలంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వెనుకాముందూ ఆలోచించేది. మోడీ ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గితే ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ప్రజలకు తగ్గింపు ఉపశమనం కల్పించలేదు. 2015లో ఎక్సైజ్ సుంకం ద్వారా రూ.90 వేల కోట్లు వస్తే 2020 నాటికి అది రూ.3.5 లక్షల కోట్లకు చేరింది. కరోనా కష్ట కాలంలోనూ సగటు ప్రజలను పీల్చిపిప్పి చేసింది. కనీసం వ్యాట్ అయినా తగ్గించకుండా తెలుగు
రాష్ట్రాలు పోటీపడి జనం మూలిగలు పీల్చాయి.
ప్రస్తుతం బీజేపీ పాలిత యూపీ, హర్యానా ప్రభుత్వాలు పెట్రోలుపై రూ.12 వ్యాట్ తగ్గించాయి. గుజరాత్, అసోం, కర్నాటక, గోవా, మణిపూర్, త్రిపురలో రూ.7, బీహార్, ఒడిశాలో రూ.3, ఉత్తరాఖండ్, అరుణాచలప్రదేశ్, మధ్యప్రదేశ్లో రూ.2 చొప్పున తగ్గించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ 29 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి పేలవమైన ఫలితాలను చవిచూసింది. ఐదు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఓ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడే ఇలా ఉంటే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందోనని ఆందోళనకు గురైనట్లు కనిపిస్తోంది. చమురు ధరల పెంపులో వచ్చిన ఆదాయాన్ని కేంద్రం 41 శాతం రాష్ట్రాలకు పంచుతోంది. ఇప్పుడు రాష్ట్రాల ఆదాయంలో కొంత కోత పడే అవకాశముంది. ఏదిఏమైనా సామాన్యుడ్ని ఇంతగా బెంబేలెత్తిస్తోన్న పెట్రో ధరలపై తెలుగు రాష్ట్రాల మౌనం ఏదో ఒకరోజు కోలుకోలేని దెబ్బతీయొచ్చు.