పవన్ కల్యాణ్ ఇచ్చిన వారం గడువు ముగిసింది
స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణపై జనసేనాని ఏం చేయబోతున్నారు !
“ వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాష్ర్ట ప్రభుత్వం తల్చుకుంటే కేంద్రం నిర్ణయాన్ని మార్చుకునే అవకాశముంది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు. అయినా ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోవడం సరికాదు. కేంద్రం తీరును నిరసించేందుకు వైసీపీ ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. వారం రోజులు గడువిస్తున్నా. స్పందించకుంటే నేనే ప్రత్యక్షంగా ఉద్యమంలోకి వస్తా!” అంటూ గతనెలాకరున జనసేనాని పవన్ కల్యాణ్ అల్టిమేటం జారీ చేశారు. గడువు దాటిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
అధికార వైసీపీ అప్పుడే చెప్పింది. జనసేనానివి కేవలం అరుపులే తప్ప ఆచరణ ఏమీ ఉండదని ఎద్దేవా చేసింది. పవన్ కల్యాణ్ నిరసన సభ నాడు సక్సెస్ అయింది. స్టీల్ ప్లాంటు కార్మికులు కూడా పవన్సహకారాన్ని స్వాగతించారు. మొదటి నుంచీ కార్మిక సంఘాల జేఏసీకి వామపక్షాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతలదీ మౌనమే. వైసీపీ, టీడీపీ స్టీల్ ప్లాంటుపై పిల్లి మొగ్గలు వేస్తున్నాయి. ఇక్కడ కార్మికులకు మద్దతిస్తాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో నిలదీయలేవు. జనసేన కూడా బీజేపీకి మిత్ర పక్షమే. అయినా స్టీల్ ప్లాంటు విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాలనూ కోల్పోయింది. ప్రజల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు వెల్లడయింది. ఇది గమనించిన కేంద్రం పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కొంత తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యాట్తగ్గించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికీ ఆ సెగ తాకింది. సమర్థించుకునేందుకు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఫుల్‌పేజీ యాడ్స్ విడుదల చేసింది. ఈసమయంలో అన్ని రాజకీయ పక్షాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తే తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉండొచ్చు. ఇప్పటివరకూ ఆ దిశగా అధికార వైసీపీ ముందుడుగు వేయలేదు. పవన్కల్యాణ్ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశమైంది. మిత్రపక్షమైన బీజేపీని ఒప్పించి స్టీల్‌ప్లాంటు విషయంలో క్రెడిట్కొట్టేస్తుందా.. బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.
ఇప్పుడు రాజకీయాలు స్టీల్ ప్లాంట్ మీద నడవడంలేదు, పెట్రోల్ చుట్టూ నడుస్తున్నాయి. రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. రెండు రాష్ట్రాల అధికార పక్షాలు చిన్న చిన్న ప్రత్యర్థులను పట్టించుకోకుండా కేంద్రం మీద పోరాటాలు మొదలుపెడుతున్నాయి. ఎక్కడ తగ్గుతారో ఎక్కడ నెగ్గుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
ఒకటి తర్వాత మరొకటి అన్నీ ముందుకొస్తాయి. అది అనివార్యం.