నవీన్ పట్నాయక్‌తో సీఎం జగన్ చర్చలు సఫలం
తెలంగాణతోనూ చర్చిస్తే నష్టమేంటీ ?
నదీజలాలు, ఇతర అంశాలపై మంగళవారం సీఎం జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. బహుదా రిజర్వాయర్ నుంచి ఇచ్చాపురానికి నీళ్లిచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బలిమెల, అప్పర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ అంశాలపైనా మాట్లాడారు. పోలవరంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రెండు ప్రభుత్వాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇంకా సరిహద్దు జిల్లాల్లో నెలకొన్న సమస్యలపైనా కూలంకుషంగా ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నారు. ఇరు ప్రభుత్వ అధికారులతో సమన్వయ కమిటీతో ముందుకు సాగాలని భావించారు. అలాగే పొరుగునున్న తెలంగాణతోనూ ఇలా ఎందుకు చర్చించకూడదనే అంశం ముందుకొచ్చింది.
ఒడిశా వెళ్లి సీఎంతో అనేక విషయాలపై చర్చించిన సీఎం జగన్ పొరుగునున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఇలా ఎందుకు చర్చించలేకపోతున్నారు ! ఒడిశాకన్నా ఎక్కువ అంశాలు తెలంగాణతో ముడిపడి ఉన్నాయి. రాష్ట్రానికి ఆయుపట్టువైన కృష్ణా, గోదావరి నదీ జలాలను పంచుకోవాల్సిన తెలంగాణతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ? ఇరువైపులా ప్రజల్లో భావోద్వేగాలను నింపి కీలక ప్రాజెక్టులను కేంద్రం చేతిలో ఎందుకు పెడుతున్నారనే ప్రశ్నలు రాష్ర్ట ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో రాయలసీమ ప్రజలకు సాగు, తాగు నీరివ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, వాళ్లంతా తమకు సోదర సమానులని కేసీఆర్ అన్నారు. ఈ జీవనదులకు చివరనున్న ఏపీ ఎందుకు చొరవ చూపలేకపోతుందనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది.
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలో ఇప్పటివరకు జరిగిన చర్చల్లో సానుకూలత కనిపించడం లేదు. ఎవరికి వాళ్లు పట్టుదలకు పోవడం, ప్రజల్లో భావోద్వేగాలకు దారితీస్తోంది. ఒడిశా సీఎంతో మాట్లాడినట్లు సీఎం కేసీఆర్‌తో చర్చిస్తే రాయలసీమ ఎత్తిపోతల సమస్య పరిష్కారం కాదా ! గోదావరి నుంచి పెన్నా వరకు నీటిని తీసుకెళ్లడం సాధ్యం కాదా ! ఇంకా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, సాగర్ జలాల విడుదలలో నెలకొన్న అనేక సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకునే వీలుంది. ఆ దిశగా సీఎం కేసీఆర్‌తో చర్చలకు ఎందుకు చొరవ చూపడం లేదో అర్థం కావడం లేదు. రెండేళ్ల కిందటిదాకా దోస్తీగా ఉన్న తెలంగాణ సీఎం ఇప్పుడు శత్రువు ఎలా అయ్యారు ! రాజకీయాలు ఎన్నయినా ఉండొచ్చు. ఎవరి ఎత్తుగడలు వారివి. ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా పంపకాలు జరగాల్సిన చోట సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం పాలకుడి లక్షణం. సీఎం జగన్ త్వరలో కేసీఆర్ కూ ఓ పుష్పగుచ్చం ఇచ్చి ఏడుకొండలవాడి ప్రసాదాలు అందజేయాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.