రాజధాని రైతులపై పోలీసుల లాఠీచార్జ్
అయ్యో పాపం అంటున్న ప్రజలు
రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వెల్లువ
“ఇప్పటిదాకా అది రెండు నియోజకవర్గాల్లోని రైతుల సమస్యగా ప్రజలు భావించారు. వాళ్లకు అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేయడంలో తప్పు లేదు. ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించవచ్చు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు రైతులు ఎందుకు నష్టపోవాలి ! ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది కూడా సరికాదు. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, ఆంక్షలు పెట్టడం, కేసులు బనాయించడంతో వాళ్లపై ప్రజల్లో ఎక్కడలేని సానుభూతి వెల్లువెత్తుతోంది. అమరావతి రైతులు సీఎం జగన్కు కృతజ్ఞతలు చెప్పొచ్చు !” అంటూ అధికార పార్టీలో తటస్థంగా ఆలోచించే ఓ నేత వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతికి భూములిచ్చిన రైతులు ఏడాదిన్నరగా ఆందోళన చేస్తున్నారు. వాళ్లకు తెలుగు దేశంతోపాటు ఇతర రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. దీన్ని రాజకీయ కోణంలో వైసీపీ వ్యతిరేకించింది. చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిన రాజధాని భూముల సమస్యకు మరింత పీటముడి పడింది. ప్రభుత్వం పంతానికి పోయి వాళ్ల ఆందోళనను అణచివేసేందుకే ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వం ఎంతకూ స్పందించకపోవడంతో పది రోజుల క్రితం అమరావతి రాజధాని రైతులు తిరుమలకు మహా పాదయాత్ర తలపెట్టారు. మొదట ప్రభుత్వం అనుమతినివ్వలేదు. హైకోర్టు ఆదేశాలమేరకు యాత్ర ప్రారంభమైంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో భూములు కొని నష్టపోయిన వాళ్లు రాష్ట్రమంతా ఉన్నారు. వాళ్ల బంధువులు, స్నేహితులూ ఉన్నారు. విపక్షాల మద్దతూ ఉంది. అనివార్యంగా రైతులకు స్వాగతం పలుకుతూ జనం పోగవుతారు. ప్రభుత్వం పెట్టే ఆంక్షలను ప్రజలు పట్టించుకోరు. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా అణచివేసే ధోరణితో ప్రభుత్వ చర్యలు ఉండడం గమనార్హం.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ సమీపంలో గురువారం యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రభుత్వం అనుమతించిన సంఖ్యకు మించి ప్రజలు గుమిగూడడానికి వీల్లేదంటూ పోలీసులు జనంపై లాఠీలు ఝుళిపించారు. సంతనూతలపాడుకు చెందిన ఓ రైతుకు చెయ్యి విరిగింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాష్ట్రమంతా అయ్యో పాపమంటూ రైతుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈపాటికే పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. మాస్క్ లేదని, ఇంకా పలు కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు కేసులు బనాయించారు. వీటన్నింటితో అమరావతి రైతుల పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇవన్నీ పట్టించుకోకుండా వైసీపీ నేతలు తమ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉన్నందున రైతుల పాదయాత్రను అనుమతించవద్దని పోలీసులకు విన్నపాలు చేస్తున్నారు. ఏదో రకంగా యాత్రకు విఘ్నాలు సృష్టించే పనిలో అధికార పార్టీ నిమగ్నమైంది. ఇది రాజకీయంగా నష్టదాయకమని తెలిసినా వైసీపీ మరింత పట్టుదలకు పోతోంది. ఇదే ధోరణి కొనసాగితే రైతుల పాదయాత్ర రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారొచ్చు.