ఆర్థిక ఒడిదుడుకులతో సీఎం జగన్ ఉక్కిరి బిక్కిరి
కేంద్ర సహకరిస్తేనే బయటపడేది
అమిత్‌షాకు గడ్డు పరిస్థితులపై నివేదిక
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయి. సంక్షేమ పథకాలకు నిధులు అందక సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని నవరత్నాల్లోని అమ్మ ఒడి, ఆసరాలాంటి పథకాలకు మళ్లిస్తూ ఎంత కసరత్తు చేసినా ఖర్చు చాంతాడంత ఉంటే ఆదాయం బెత్తెడే ఉంటోంది. దానికితోడు ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, అప్పులకు వడ్డీ కిస్తీలు ఉండనే ఉన్నాయి. వీటికితోడు కేంద్ర గ్రాంట్లకు రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయాలి. నిత్యం ఆర్బీఐ నుంచి ఓడీ తప్పడం లేదు. బయట అప్పులు పుట్టే పరిస్థితుల్లేవు. కేంద్రం దయతలిస్తే తప్ప ఈ సుడిగుండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర సహకారాన్ని కోరుతో శనివారం హోంమంత్రి అమిత్‌షాను కలిసి వివరించనున్నట్లు సమాచారం.
ఈపాటికే విద్యుత్ పంపిణీ సంస్థలు కేంద్ర పవర్ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల బకాయిపడింది. రెండు వారాల్లో చెల్లించకుంటే పవర్ నిలిపేయాలని ఆదేశించింది. మరోవైపు కర్నాటక డెయిరీకి రూ.130 కోట్ల పాల ఉత్పత్తుల బకాయి చెల్లించనందున సరఫరా నిలిపేసింది. ఆస్పత్రుల్లో వినియోగించే వైద్య పరికరాలు సైతం బకాయిలు చెల్లించకుంటే సరఫరా చేయలేమని ఆ సంస్థలు తెగేసి చెప్పాయి. ముందుగా మొత్తం నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని స్పష్టం చేశాయి. మొత్తంగా విద్యుత్, వైద్య రంగాలు అతాలకుతలమవుతున్నాయి. కేంద్ర నిబంధనల ప్రకారం ఇక అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేదు. ప్రభుత్వ భూములు, ఆస్తులు విక్రయించడానికి ఇప్పటికిప్పుడు సాధ్యపడదు. బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడానికి సుముఖంగా లేవు. ఇలాంటి దుస్థితిలో కేంద్రం ప్రత్యేకంగా ఆదుకుంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితి లేదు.
ఇలాంటి తరుణంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సదస్సు ఆదివారం తిరుపతిలో నిర్వహిస్తున్నారు. సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షత వహిస్తారు. శుక్రవారం సాయంత్రమే సీఎం అమిత్‌షాకు స్వాగతం పలికిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను అమిత్‌షా దృష్టికి తీసుకురానున్నారు. ఆయన స్పందనను బట్టి దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ముఖ్యమంత్రి జగన్ ఏఏ అంశాలు లేవనెత్తుతారనేది ఆధారపడి ఉంది. జగన్ సర్కారును ఆర్థిక ఇబ్బందుల నుంచి కమలనాధులు బయటపడేస్తారా లేక రాజకీయ ప్రయోజనం కోసం ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది చర్చనీయాంశమైంది.