యాసంగి వరి సాగుపై రైతుల మల్లగుల్లాలు
వద్దంటున్న టీఆర్ఎస్ సర్కారు
సాగు చేయాలంటున్న బీజేపీ
భరోసానివ్వని కేంద్రం
“ సాగు నీరు పుష్కలంగా ఉంది. వరి సాగు చేసుకుంటే ఇంటిల్లపాదీ పనుంటది. ఒకట్రెండు గేదెలు పెట్టుకుంటే కుటుంబం ఎల్తది. ఇంకే పంటేసినా చేతి నిండా పని ఉండదు. అందరూ తినేది అన్నేమేగా సార్ ! ప్రజలందరికీ తిండి గింజలు కావాలిగా. ఇప్పుడు పంట ఎయ్యొద్దంటే ఏం చేయాలో అర్థమవతలేదు ! ” అంటూ నల్లగొండ జిల్లా పెద్దడిశర్లపల్లి రైతులు వాపోయారు. ఎస్ఎల్బీసీ కింద వరి తప్ప వేరే పంట సాగు చేయలేమని రైతులు తెగేసి చెబుతున్నారు.
యాసంగి వరి సాగుపై టీఆర్ఎస్ సర్కారు ఏమంటుందంటే.. గత ఏడాది పూర్తిస్థాయిలో ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరినా ఇంకా 5 లక్షల టన్నుల ధాన్యం మిగిలేఉంది. వర్షాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. కోతలు మొదలయ్యాయి. సుమారు 1.70 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. తద్వారా 1.10 కోట్ల టన్నుల బియ్యం సిద్ధమవుతుంది. దీన్ని ఎఫ్సీఐ కొంటుందా లేదా అనేది తేల్చడం లేదు. ధాన్యం సేకరణపై కేంద్రానికి జాతీయ స్థాయిలో ఏకరూప విధానం లేదు. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం వరి స్థానంలో ఇతర పంటలు సాగు చేయాలని సూచిస్తోంది.
దేశ వ్యాప్తంగా నేడు వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆమేరకు ఎఫ్సీఐ కొనుగోలు చేయడం లేదు. ఈపాటికే ఎఫ్సీఐ వద్ద 2.88 కోట్ల టన్నుల బియ్యం నిల్వ ఉన్నందున తాము బాయిల్డ్ రైస్ సేకరించలేమని చెబుతోంది. ఇదే బాయిల్డ్ రైస్ వినియోగించే కేరళ, తమిళనాడు తమ అవసరాలకు తగ్గట్లు వరి సాగు చేసుకుంటున్నాయి. అందువల్ల ఎగుమతులకూ అవకాశం లేదు. కేవలం రారైస్ కు మాత్రమే మార్కెట్ అవకాశముంది. బీపీటీల్లాంటి సన్నరకం బియ్యాన్ని ప్రజలుగా ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ దిగుబడి వచ్చే అలాంటి రకాలను సాగు చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తగు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. ఇప్పుడు రైతులు అడకత్తెరలో పోకచెక్కలా మారారు.
లక్ష కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. మిగతా అన్ని ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. రూ.10 వేల కోట్లు వెచ్చించి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వరి సాగు వద్దంటే బోర్లు, బావుల కిందనైతే వేరే పంట సాగు చేస్తారు. మాగాణి భూముల్లో ఇప్పటికిప్పుడు ఉద్యాన పంటల సాగు సాధ్యం కాదు. ఏపీతో పోల్చుకుంటే ఇక్కడ కౌలు సాగు తక్కువ. చిన్నసన్నకారు రైతులకు వరి పంట సాగు చేస్తేనే ఇంటిల్లపాదీ పనులుంటాయి. అనుబంధంగా పాడి పరిశ్రమతో కుటుంబాలకు అదనపు ఉపాధి ఏర్పడుతుంది. అందుకే వరిసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలందరూ వినియోగించే బీపీటీ రకాల సాగుకు రైతులను సమాయత్తం చేయాలి. ప్రతీ ఐదు వేల ఎకరాలను ఓ క్లస్టరుగా చేసి మౌలిక సదుపాయాలు అందిస్తున్న ప్రభుత్వానికి ఇదేమంత పెద్ద సమస్య కాదు. ఇప్పటికీ ప్రజల ప్రధాన ఆహారం అన్నమే. అందువల్ల సన్నబియ్యం రకాల సాగువైపు రైతులను మళ్లించాలి. అంతేగానీ రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యను వాడుకోవడం అటు బీజేపీకి, టీఆర్ఎస్కు శ్రేయస్కారం కాదు. ఎవరేం మాట్లాడుతున్నారు.. వాటి వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయనేది రైతులూ గమనిస్తున్నారు.