టీడీపీ, వైసీపీతో సమాన దూరం పాటించండి
పార్టీ శ్రేణులకు కేంద్ర హోంమంత్రి అమిత్షా దిశా నిర్దేశం
“ రెండున్నరేళ్లలోనే వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. దాన్ని టీడీపీ ఉపయోగించుకునే పరిస్థితుల్లేవు. ఏపీ ప్రజలు వంశపారంపర్య కుటుంబాల పాలనను కోరుకోవడం లేదు. ఇలాంటి సమయంలో బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి అన్ని అవకాశాలున్నాయి. అందుకు తగ్గ ఎత్తుగడలతో ముందుకు సాగాలి !” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన అమిత్ షా సోమవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన ప్రస్తావించిన పలు అంశాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి.
రాష్ట్ర దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీ యంత్రాంగం తగు కార్యాచరణను అమలు చేయాలని అమిత్ షా కోరారు. టీడీపీ, వైసీపీ పాలనలో అవినీతి పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ రెండు కుటుంబాల పాలనతో ప్రజలు విసిగిపోయినట్లు వెల్లడించారు. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య కోసం వైసీపీతో సన్నిహితంగా మెలిగినట్లు తెలిపారు. కింది స్థాయి నుంచి బీజేపీ బలోపేతం కావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగడానికి మరింతగా కష్టపడాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు.
సదరన్ స్టేట్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ నిర్మొహమాటంగా మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనాలు, రెవెన్యూలోటు, తెలంగాణతో ముడిపడి ఉన్న విభజన సమస్యలపై ఇప్పటిదాకా కేంద్రం సరిగ్గా స్పందించలేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇప్పటికైనా హోంమంత్రి జోక్యం చేసుకొని రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు. మరుసటి రోజునే అమిత్ షా వైసీపీ, టీడీపీలకు దూరంగా సొంత కార్యాచరణతో ముందుకు సాగాలని, ఈ రెండు పార్టీల తీరుపై పోరాడాలని పిలుపునివ్వడం విశేషం.