ఏడాది నుంచి పరీక్షలకు అనుమతించడం లేదు
మేనేజ్మెంటు కోటాలో డీఎడ్ చదువుకోవడం నేరమా ?
విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తారా ?
ఆ అమ్మాయి పేరు సీహెచ్ భార్గవి. సొంతూరు గుంటూరు జిల్లా వినుకొండ. 2018లో డీసెట్ పరీక్ష రాసింది. క్వాలిఫై అయినా అనారోగ్య కారణాలతో కౌన్సెలింగ్ కు హాజరు కాలేకపోయింది. తమ ఊళ్లోని కనమర్లపూడి బీఎడ్ కాలేజీలో మేనేజ్మెంటు కోటా కింద చేరింది. రెగ్యులర్గా కళాశాలకు వెళ్లి చదువుకుంది. గతేడాది పరీక్షల నాటికి హాల్ టిక్కెట్ రాలేదు. అదేమని అడిగితే మేనేజ్మెంటు కోటా సీట్ల భర్తీలో సదరు కళాశాల జిల్లా ఎంపిక కమిటీ నిబంధనలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. రెండేళ్లపాటు చదువుకున్నా పరీక్షలకు అనుమతించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.
2018లో రాష్ట్ర వ్యాప్తంగా 744 కళాశాలల్లో సుమారు 27 వేల మంది విద్యార్థులు మేనేజ్మెంటు కోటాలో ప్రవేశాలు పొందారు. 2020లో వారికి పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులకు హాల్ టిక్కెట్లు రాలేదు. సదరు కళాశాలలు 2015లో ఇచ్చిన జీవో 30 ప్రకారం నిబంధనలు పాటించకుండా మేనేజ్మెంటు కోటా సీట్లు భర్తీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నిబంధనలు పాటించకుంటే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు. ఆరేళ్ల క్రితం జీవో విడుదలయ్యాక తదుపరి విద్యాసంవత్సరాల్లో వరుసగా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రభుత్వం వచ్చాక 2020లో పాత జీవోను అడ్డం పెట్టుకొని మేనేజ్మెంటు కోటా విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుండా వేధిస్తున్నారు. కేవలం కన్వినర్ కోటాలో అడ్మిషన్లు పొందిన వారికే పరీక్షలు నిర్వహించారు. దీనిపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.
“యాజమాన్యాలు ఏవైనా తప్పులు చేస్తే చర్యలు తీసుకుంటాం. కళాశాలకు వెళ్లి చదువుకున్న విద్యార్థులకు మాత్రం అన్యాయం జరగనివ్వం. గత ప్రభుత్వ హయాంలో జిల్లా ఎంపిక కమిటీతో సంబంధం లేకుండా అడ్మిషన్లు ఇచ్చాయి. వాటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. విద్యార్థులను మాత్రం పరీక్షలకు అనుమతిస్తాం !” అంటూ 2020డిసెంబరు 17న శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఏడాది కావొస్తోంది. ఇంతవరకు దీనిపై పాఠశాల విద్య డైరెక్టరేట్ స్పందించలేదు. మంత్రి ఆదేశాలు ఎందుకు పాటించలేదని విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడికి కాల్ చేస్తే.. ఆఫీస్ సమయంలో వచ్చి అడిగితే వివరణ ఇస్తామన్నారు. అదీ సంగతి. అమాత్యుల ఆదేశాలకే ఏడాది నుంచి దిక్కులేదంటే ప్రభుత్వ తీరు ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తోంది.