అమిత్షా మార్గదర్శనంలో ఇదే ఆంతర్యం
రాజకీయ, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో లోపం
ఏపీలో బీజేపీ బలపడాలి. అదెప్పుడో కాదు. 2024 ఎన్నికల నాటికి ప్రధాన పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలి. అందుకోసం ఏం చేస్తున్నారు ! ఏం చెయ్యాలి అనే అంశాలపై అమిత్షా ఆ పార్టీ నేతలతో సుధీర్ఘంగా చర్చించారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమయ్యే చొరవ లేకపోవడాన్ని గుర్తించారు. లోపాలను సవరించుకోకుంటే కుదరదని నేతలను హెచ్చరించినట్లు సమాచారం. ఏపీలో సానుకూల అంశాలున్నా వాటిని అందిపుచ్చుకోలేని బలహీనతలను అమిత్షా నాయకుల ముందే బయటపెట్టినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకునే బుద్దిమంతులు ఇక్కడ బీజేపీ నేతలు. వాళ్లు ఆడమంటే ఆడతారు. పాడమంటే పాడతారు. స్వతంత్రంగా ఆలోచించి కార్యాచరణను రూపొందించుకోవడంలో వెనుకబాటుతనం ఉంది. అధ్యయనం చేయడంలోనూ బోలెడు లోపాలున్నాయి. ఇప్పటిదాకా క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునాదులు వేసుకుంటూ వచ్చే కార్యక్రమం ఒక్కటీ లేదు. అసలు గ్రామీణ, అర్బన్ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితుగతులపైనే ఆ పార్టీకి సరైన అవగాహన లేదు. ఉత్తర భారతంలో మాదిరిగా దేశభక్తి, మతంలాంటి సెంటిమెంట్లు ఇక్కడ పనిచేయవు. ఆ విషయాన్ని ఇక్కడ నేతలు అధిష్టానానికి చెప్పలేరు. వాళ్లకు తెలీదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బీజేపీ బలంగా ప్రజల్లో ముద్ర వేయలేకపోతోంది. ఇప్పటిదాకా జీ హుజూర్ అనేచోటనే ఇక్కడ నేతలు ఆగిపోయారు. తిరుపతి వచ్చినప్పుడైనా అమిత్ షా సమక్షంలో ఇలాంటి అర్థవంతమైన చర్చకు దారితీసి ఉంటే హైకమాండ్ నుంచి సరైన మార్గదర్శకాలు విడుదల చేయడానికి దోహదపడేది.
ప్రస్తుతం రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేవు. స్వతంత్రంగా ఎదగడానికి ఇంతకన్నా అవకాశాలు ఏముంటాయని అమిత్ షా రాష్ట్ర నేతలను నిలదీసినట్లు తెలుస్తోంది. పై నుంచి ఆదేశాలను పాటించడానికే అలవాటుపడిన కమలనాధులు సొంత కార్యాచరణతో జనంలో చొచ్చుకుపోలేకపోయారు. పైగా కేంద్రం పెట్రో, గ్యాస్ ధరలు నిరంతరం పెంచడం, స్టీల్ ప్లాంటును అమ్మాలనే నిర్ణయాలు ఇక్కడ నేతలను జనంలోకి వెళ్లకుండా వెనక్కి లాగుతున్నాయి. రానున్న ఉత్తరాది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రాభవం తగ్గనున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అనుకూల పరిస్థితులున్నచోట ఎదగాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు ఏపీ నేతల పని విధానంలో మార్పు వస్తుందా !