బడ్జెట్ చిత్రాల వైపు నిర్మాతల దృష్టి
కథాంశానికే ప్రాధాన్యం
చిత్రసీమ గతినే మార్చేస్తున్న జైభీమ్
అభిమానులు ఉండకపోవచ్చు. బెనిఫిట్ షోల కోసం ఎగబడే ఫ్యాన్స్ కనిపించకుండా పోవచ్చు. ఒళ్లంతా కనిపించే దుస్తుల్లో హీరోయిన్లు అదృశ్యం అవ్వొచ్చు. హీరో వందమందిని ఒక్క చేత్తో మట్టి కరిపించే అరవీర భయంకర సీన్లు ఇక కానరాకపోవచ్చు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినించకపోవచ్చు. హీరోలను ఎలివేట్ చేస్తూ.. ఇంట్రడ్యూసింగ్ సాంగ్స్ కు తావే లేకపోవచ్చు. కేవలం కథాంశానికే ప్రాధాన్యం ఉండొచ్చు. ఊహా లోకాల నుంచి ప్రేక్షకుడిని తన చుట్టూ ఉండే ప్రపంచంలోకి లాక్కెళ్లే సినిమాలు రావొచ్చు !” అవును. ఇలాంటి ఆలోచనలు.. వాటిపై చర్చలు మొదలయ్యాయి. సినీ అభిమానుల మెదళ్లపై సవారీ చేస్తున్నాయి. ఇదంతా కేవలం ఒకే ఒక్క చిత్రం జైభీమ్ సాధించిన అఖండ విజయం.
జైభీమ్ చిత్రం అన్ని వయస్సుల వారిని కట్టిపడేసింది. హృదయాంతరాలను తాకింది. నిద్రాణమైన మానవతను తట్టి లేపింది. మనిషితనానికి అర్థాన్నిచ్చింది. వ్యవస్థలోని కుళ్లును కళ్లకు కట్టింది. గుండెలోని ఆర్థ్రతను కన్నీటి రూపంలో బయటకు రప్పించింది. డీ గ్లామరస్ పాత్రలు మన ఇంటి చుట్టుపక్కలకు తీసుకెళ్లింది. శ్రమ జీవుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపింది. నిరుపేదల న్యాయ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. నిజ జీవితంలో హీరోలను పరిచయం చేసింది. నటులు పాత్రలకే పరిమితం కాలేదు. జీవ కళకు ప్రాణం పోశారు. కథాంశమే హీరో అయ్యింది. అంతిమంగా సినిమా గతినే మార్చేసింది.
ఇలాంటి సినిమాలను ప్రజలు గుండెల్లో దాచుకుంటారని టాలీవుడ్ నిర్మాతలకు అవగతమైనట్లుంది. కులవంశ హీరోల మకిలి నుంచి బయటపడేందుకు దారులు వెదుకుతున్నారు. బలమైన కథల కోసం అన్వేషణ ప్రారంభించారు. బడ్జెట్ చిత్రాలతో ముందుకు సాగాలనే ఆలోచన పురుడుపోసుకుంది. థియేటర్లను వాళ్ల కబ్జాకే వదిలేసి అంతర్జాలంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. జైభీమ్ చిత్రం రాకముందే చిన్న నిర్మాతలు బడ్జెట్ చిత్రాలను నిర్మించి ఓటీటీలో విడుదల చేయడం ప్రారంభించారు. ఈ చిత్రాలు నెటిజన్ల ఆదరణను చూరగొన్నాయి.
జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో విడుదలైన కొండ పొలం విజయం సాధించింది. స్టార్డమ్ ను వదులుకొని నటి రకుల్‌ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో నటించింది. ఓ గొర్ల కాపరి కుమారుడు అడవిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించే చిన్న కథాంశంతో చిత్రాన్ని నిర్మించారు. సమాజంలో అత్యాశపరులను దోచుకునే తీరును బ్లఫ్ మాస్టర్ చిత్రం ద్వారా దర్శకుడు గోపి గణేష్ పట్టాభి అద్భుతంగా తెరకెక్కించారు. ఉమ్మడి రాష్ర్టంలో రైస్ పుల్లింగ్, మైక్రో లెవల్ మార్కెటింగ్ పేరుతో ప్రజలను నిలువునా ముంచేసిన ఘటనల ఇతివృత్తంతో రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని తీశారు. ఇవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. పెద్దగా ఖర్చు లేదు. భారీ సెట్టింగుల్లేవ్. అతిభారీ రెమ్యునరేషన్లు లేవు. ఇలాంటి చిత్రాలకు ఇప్పుడు జైభీమ్ ప్రాణం పోసింది. సినీ ప్రేక్షకుల అభిరుచుల్నే మార్చేసింది. చలనచిత్ర సీమను గుప్పెట పట్టిన వాళ్లకు ఇకనైనా కనువిప్పు కలుగుతుందో లేదో !