అనవసరంగా కమ్మరావతి అంటూ నిందలేస్తున్నారు
టీడీపీ అభిమానులు చెబుతున్నది ఇదే. అమరావతి రాజధానికి భూములిచ్చిన 29,881 మంది రైతుల్లో కమ్మవారు కేవలం 18 శాతమే. 32 శాతం ఎస్సీలు అత్యధికంగా భూములు ఇచ్చారు. రెడ్లు 23 శాతం, బీసీలు 14 శాతం, కాపులు 9 మంది ఉన్నారు. కమ్మవారు లబ్ది పొందింది ఎంత శాతమో అర్థమవుతుందా ! అనవసరంగా ఆడి పోసుకుంటున్నారు. ఇంకా భూస్వాములకే అమరావతి ప్రయోజనాలు అని నిందిస్తున్నారు. ఇది తగునా అంటూ తెలుగు తమ్ముళ్లు ఒకటే ఇదై పోతున్నారు.
ఎకరంలోపున్న 20,490 మంది రైతులు 10,035 ఎకరాలు ఇచ్చారు. ఒకటి నుంచి రెండెకరాల్లోపున్న 5,227 మంది 7,466 ఎకరాలు రాజధాని భూసమీకరణకు సమర్పించారు. రెండు నుంచి 5 ఎకరాల్లోపు 3,337 మంది 10,104 ఎకరాలు ఇచ్చారు. 5 నుంచి 10 ఎకరాల్లోపున్న 668 మంది ఇచ్చింది 4,421 ఎకరాలు. 10 నుంచి 20 ఎకరాల్లోపున్న 142 మంది ఇచ్చింది 1877 ఎకరాలే. 20 నుంచి 25 ఎకరాల్లోపున్న 12 మంది ధనిక రైతులు ఇచ్చింది 269 ఎకరాలు. ఇక 25 ఎకరాలపైనున్న ఐదుగురు భూస్వాములు రాజధానికిచ్చింది కేవలం 151 ఎకరాలు మాత్రమే. ఇప్పుడు చెప్పండి.. ఎవరెంత లబ్ది పొందుతున్నారో అంటూ తమ్ముళ్లు ఢంకా బజాయిస్తున్నారు.
ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ల సమస్యను పక్కన పెడితే.. వాటి పరిసరాల్లో ముందుగానే పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన బడాబాబుల లబ్ది కోసమే చంద్రబాబు అక్కడ రాజధాని పెట్టారనేది వైసీపీ అన్నయ్యల అభియోగం. భూసమీకరణకు ముందే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటున్నారు. అబ్బే అదేం లేదంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో మూడు రాజధానులను సీఎం జగన్ తెరమీదకు తీసుకొచ్చారు. లక్ష కోట్లు ఒక్కచోటనే కుమ్మరించే ఆర్థిక స్థితి రాష్ట్రానికి లేదు. అలా చేస్తే ప్రాంతీయ ఉద్యమాలు చెలరేగుతాయని వైసీపీ వాదిస్తోంది. అందుకే రాజధాని వికేంద్రీకరణ చేస్తామంటోంది. కేవలం శాసన రాజధానిగా ఉంటే తమ భూములకు ఆశించిన విలువ పెరగదని భూయజమానులు అగ్గిలంమీద గుగ్గిలమవుతున్నారు.
ఇప్పుడు న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రలో పాల్గొన్నది కేవలం రాజధానికి భూములిచ్చిన వాళ్లేనా ! ప్రభుత్వం ఎకరానికి రూ.50 వేల చొప్పున వాళ్లకు కౌలు చెల్లిస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో అభివృద్ధి చేసి కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. రెండున్నరేళ్ల నుంచి కౌలు చెల్లిస్తున్నారు. ఈ భూములను కమర్షియల్గా అభివృద్ధి చేయకపోవడం వల్ల ఇప్పటిదాకా వెచ్చించిన ప్రజాధనం వృథా అవుతోంది. ఆ భూముల్లో కట్టడాలకు వెచ్చించిన ప్రజల సొమ్మంతా బూడిదలో పోసినట్టేనా ! దీనికెవరు సమాధానం చెబుతారు ? అప్పు లేకుండా పూట గడవని సర్కారుకు అటు చెంపదెబ్బ, ఇటు చేతి దెబ్బ తప్పేట్లు లేవు మరి.