వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని నిందితుడిగా పేర్కొంటే తనతోపాటు మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. మరోవైపు సీబీఐ విచారణలో వివేకా కారు డ్రైవర్ దస్తగిరి మాత్రం అవినాష్ పాత్ర ఉన్నట్లు చెప్పాడు. ఇంతకీ ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి ఎవరికి అల్టిమేటం జారీ చేశారని వైసీపీలో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయన హెచ్చరిక సీబీఐకా లేక సీఎం జగన్ కా అనేది ఆయనే స్పష్టం చేయాలి మరి.
మరోవైపు మాజీమంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఉపాధిహామీ పథకం అమలు తీరుపై ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిమెంటుతోపాటు నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ఎస్ఎస్ఆర్ రేట్లు మాత్రం పెరగడం లేదు. దీంతో మెటీరియల్ కంపొనెంట్ కింద పనులు చేసిన వాళ్లు నష్టాలపాలవుతున్నట్లు ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. పరువు ప్రతిష్టలకు పోయి పనులు చేపట్టిన ప్రజాప్రతినిధులు నష్టాలను చవిచూస్తున్నట్లు వెల్లడించారు. మెప్పు కోసం అధికారులు ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సలహాలు ఇవ్వొద్దని నిర్మొహమాటంగా హితవు పలికారు.
వాస్తవానికి ఇలాంటి అంశాలను ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి. దీనికి భిన్నంగా ప్రెస్మీట్లు పెట్టి వాపోవడమేంటో ! అంటే పెద్ద తలకాయలు కూడా తమ గోడు పట్టించుకోవడం లేదనేదే కదా అర్థం ! హతవిధీ.. ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటిది జగనన్నా !