‘ఎయిడెడ్’పై వెనుకడుగేస్తూ జీవో జారీ
ప్రక్షాళన ఆపొద్దు
ఎయిడెడ్ స్కూళ్లలోనే ఉపాధ్యాయులు కొనసాగదల్చుకుంటే వాళ్లిష్టం. ఇష్టపడి వచ్చిన వాళ్లనే ప్రభుత్వంలోకి తీసుకోండి. బలవంతం ఏమీ లేదంటూ ఏపీ ప్రభుత్వం నిన్న 50వ నంబరు జీవో జారీ చేసింది. దీన్ని విపక్షాలు తమ విజయంగా ప్రకటించుకున్నాయి. గాడితప్పిన విద్యా వ్యవస్థను ప్రభుత్వం ప్రక్షాళన చేయాలనుకుంది. అందులో లోపాలుంటే సూచనలు చేయొచ్చు. దీనికి భిన్నంగా విపక్ష నేతలు వ్యవహరించడం చర్చనీయాంశమైంది.
అది ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఓ ఎయిడెడ్ పాఠశాల. స్కూల్లో నమోదయిన విద్యార్థులు ఎక్కడో ప్రైవేటు స్కూళ్లలో చదువుతుంటారు. ఉపాధ్యాయులకు చదువు చెప్పడం కన్నా మిగతా వ్యవహారాలు చక్కబెట్టుకోవడంపైనే ధ్యాస ఎక్కువ. ఇలాంటి పాఠశాలలో మూడేళ్ల క్రితం టీచర్ పోస్టుల భర్తీ చేపట్టారు. దొడ్డిదారిన లక్షల్లో పోస్టులను అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అభ్యర్థులు దుమ్మెత్తి పోశారు. ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ప్రసార సాధానలు ఏకిపారేశాయి. గత్యంతరం లేని స్థితిలో నియామక ప్రక్రియను రద్దు చేశారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్రంలో కోకొల్లలు.
ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నడిపిస్తున్న ఎయిడెడ్ స్కూళ్లు వేళ్లమీదుంటాయి. వాటికి మినహాయింపునిచ్చినా మిగతా వాటిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని కూడా రాజకీయ లబ్ది కోసం విపక్షాలు ప్రయత్నించాయి. ఆందోళనలకు తెరలేపాయి. ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వం టోకున అమ్మేస్తుందని దారుణమైన ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వం వెనకడుగేసింది.
ఇప్పటిదాకా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య దాకా కార్పొరేట్ మయం చేసిన టీడీపీ ఈ ఆందోళనలకు ముఖ్యభూమిక పోషించింది. ప్రభుత్వరంగంలో విద్యా వ్యవస్థ బలపడడం ఆ పార్టీకి ఇష్టం లేదు. దీనికి మిగతా వామపక్షాలు కూడా వంత పాడడం విశేషం. విద్యావ్యవస్థ ప్రక్షాళన కార్యక్రమంలో ఏవైనా లోపాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. మెరుగైన సూచనలు ఇవ్వొచ్చు. దీనికి భిన్నంగా విద్యా వ్యవస్థలో లోపాలను సరిచేయాలనుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు మద్దతు ఇవ్వడంపై ఆ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక జనసేన, బీజేపీకి విద్యారంగంపై ఓ పాలసీ అంటూ లేదు. ప్రభుత్వ నిర్ణయాలను ఎవరు వ్యతిరేకించినా వారితో గొంతు కలుపుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోతో ఎంతమంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పరిధిలోకి వస్తారనేది వేచిచూడాలి. దీనిపై ప్రభుత్వం మరింత ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు.