జలదిగ్బంధంలో తిరుపతి
నిరంతరం గోవింద నామంతో పునీతమయ్యే తిరుపతి నగరం భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. జనజీవనం స్తంభించింది. గురువారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నడుముల్లోతు వరద నీళ్లు పారాయి. భవనాల్లోని కింది సెల్లార్లు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత యాభై ఏళ్లలో ఇంత భారీ వర్షాన్ని ఎన్నడూ చూడలేదని ప్రజల భయభ్రాంతులకు గురవుతున్నారు. భారీ వర్షాలతో నగర ప్రజలకు ఇబ్బందులున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా అధికారులు తగు చర్యలు తీసుకోలేకపోయారు. అటు తిరుమలలోనూ వీధులన్నీ మోకాల్లోతు నీళ్లతో నిండాయి. భూమన కరుణాకరరెడ్డి తనయుడు, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తిరుపతిలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు కార్పొరేషన్ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించలేదు
– కందారపు మురళి, సీపీఎం నేత
పెద్ద ఎత్తున భారీ వర్షాలు నగరాన్ని చుట్టుముడుతున్నాయని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం కనిపిస్తోంది. వారం కిందట కురిసిన భారీ వర్షాలతో తిరుపతి నగరం తల్లఢిల్లింది. 17 నుంచి 22 దాకా జోరున వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకోలేదు. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఎవరికి వారు ప్రాణాలను దక్కించుకునేందుకు పరుగులు తీస్తున్నారు. పిల్లలు భయంతో ఏడుస్తున్నారు. వృద్దులు వణికి పోతున్నారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా.