అగ్రవర్ణాల్లోని పేదలకూ ఆర్థికంగా చేయూతనందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. డిసెంబరు 9న మీటనొక్కుతారు. ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారి బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున నగదు జమవుతుంది. ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు. కాకుంటే పేదరికానికి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లుగా గుర్తించడానికి కొలమానం విచిత్రంగా ఉంది. పదెకరాల్లోపు మెట్ట లేదా ఐదెకరాల్లోపు మాగాణి కలిగిన రైతులు లేదా భూయజమానులను ఈబీసీ నేస్తం పథకానికి అర్హులుగా నిర్ణయించారు. రైతు భరోసా, సున్నా వడ్డీ రుణం, ఇన్పుట్ సబ్సిడీ, అమ్మ ఒడి, సబ్సిడీలో సేద్య పరికరాలు ఇచ్చినా పాపం.. వాళ్లు ఆర్థికంగా వెనుకబడే ఉన్నారంటే.. నిజంగా సెంటు భూమి లేని అగ్రవర్ణ పేదలు నోటి మీద వేలేసుకుంటున్నారు.
ప్రతినెలా యాభై వేల నుంచి లక్ష రూపాయల వేతనం అందుకునే ప్రభుత్వ ఉద్యోగులూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఏళ్ల తరబడి పీఆర్సీ అమలు చేయడం లేదని గగ్గోలు పెడుతున్నారు. పెండింగులో ఉన్న డీఏ బకాయిలు, మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. ఈబీసీ నేస్తాలకు సాయం చేసినట్లే వాళ్ల డిమాండ్లు కూడా తీర్చాల్సిందే.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతినెలా గౌరవ వేతనం, ఇంటి అద్దె, ఇతర ప్రయాణ ఖర్చులకు సుమారు నాలుగు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. కారు కొనుక్కోవడానికి పాతిక లక్షల రుణమిచ్చి ప్రభుత్వం దయాగుణాన్ని చాటుకుంటోంది. మాజీలకు రూ. 50 వేలు ఇస్తున్నారు. ఇవి చాలడం లేదని ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీళ్లకూ వేతనాలు, పెన్షన్లు పెంచాల్సిందే. ఎందుకంటే వీళ్లు కూడా ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత ఎం సత్యనారాయణ రెడ్డి కన్నా ఆర్థికంగా వెనుకబడిపోయామని వాపోతున్నారు. రెడ్డీ ల్యాబ్స్ జీవీ ప్రసాద్ కన్నా పేదలమై పోయామని మదనపడుతున్నారు. సువెన్ ఫార్మా జాస్తి వెంకటేశ్వర్లుతో పోల్చుకుంటే తమ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంచేత వీళ్లకూ వేతనాలు, ఇతర అలవెన్సులు పెంచాల్సిందే మరి. సీఎంగారూ వినిపిస్తుందా సార్ ! ఇక పంచుడే పంచుడు.. దంచుడే దంచుడంటారా.. ఐతే ఓకే.
Good article.
కృతజ్ఞతలు