“ రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకోవడం సహజం. అవి ప్రజా సమస్యలపై ఉండాలే తప్ప వ్యక్తిగత అంశాలపై కాదు. ఆడపడుచులను గౌరవించడం మన సంప్రదాయం. దాన్ని భావితరాలకు అందించడం మన బాధ్యత. మహిళలను కించే పరిచే రాజకీయ విష సంస్కృతిని దయచేసి వదిలేయండి. ఇలాంటి అరాచక అరాచక పోకడలకు ఇకనైనా స్వస్తి పలకండి !” అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో నడుస్తున్న వ్యక్తిత్వ హనన రాజకీయాలపై ఎన్టీఆర్ నోరు విప్పారు. నిక్కచ్చిగా మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు శాసనసభలో కన్నీళ్లతో నిష్క్రమించిన ఘటనతో నందమూరి కుటుంబమంతా ఆయనకు అండగా కదిలింది. ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ కూడా గొంతు విప్పారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు రెండుమూడు దఫాలు కుప్పంలో పర్యటించారు. ఆసందర్భంగా పలువురు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలంటూ ఫ్లెక్సీలు కట్టారు. ప్లకార్డులు పట్టుకొని నినదించారు. చంద్రబాబు మౌనం వహించారు. కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
పార్టీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనేకమార్లు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. జూనియర్‌ను పార్టీలోకి చంద్రబాబే ఆహ్వానించాలని పదేపదే సూచించారు. అప్పుడూ చంద్రబాబు స్పందించలేదు. అదే ఇప్పుడు జూనియర్ మేనత్త, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు చేసిన అనాలోచిత వ్యాఖ్యలపై జూనియర్ స్పందించారు. షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న జూనియర్ చంద్రబాబుకు బాసటగా నిలుస్తామని కాల్ చేసి చెప్పారు. భువనేశ్వరిని కించపరిచేట్లు మాట్లాడడం విచారకరమైనా ఈ ఘటనతో నందమూరి కుటుంబం మొత్తాన్ని చంద్రబాబుకు తోడుగా నిలిపిన సీఎం జగన్‌కు, ఆయన పరివారానికి టీడీపీ కృతజ్ఞతలు చెప్పొచ్చు.