తడిసిన ధాన్యంతో కౌలు రైతు విలవిల
“ కౌలు రైతులు కష్టాల్లో ఉన్నారు. పంట రుణం లేదు. ఇన్పుట్ సబ్సిడీ రాదు. పుస్తెలు తాకట్టెట్టి పంట సాగు చేశారు. భారీ వర్షాలకు ధాన్యమంతా తడిసిపోయింది. ఈ–క్రాప్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం ఆదుకోవాలి ! ” అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ రైతు సంఘం కార్యదర్శి కే శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం దెందులూరు మండలం పోతునూరులో తడిసిన వరి పనలను పరిశీలించారు. కోతకొచ్చిన పంట నేలకు వరిగిపోయిందని తెలిపారు. ప్రభుత్వం ఇతోధికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగయింది. అందులో 75 శాతం కౌలు రైతులే సాగు చేస్తున్నారు. వీళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. కనీసం ఈ–క్రాప్‌లో కూడా కౌలు రైతులు నమోదు కాలేదు. ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది సాగు పెట్టుబడి పెరిగింది. దీనికి తోడు అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. కల్లాల్లోనే ధాన్యం తడిసిపోయింది. కోతకొచ్చిన పైరు నేలకొరిగి నీళ్లలో నానుతోంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఎకరానికి కనీసం రూ.25 వేలు పరిహారం అందించాలి. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
“ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున యంత్రాంగం ఉంది. వలంటీర్లున్నారు. ఎవరు కౌలు రైతులో.. ఎంత సాగు చేశారో తెలుసు. ఈక్రాప్‌తో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ పరిహారం అందించాలి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కోత దశకొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు ఇంతవరకు నష్టం అంచనా వేయడానికి రాలేదు. ప్రభుత్వం ఆదుకోకుంటే కౌలు రైతులు బతకలేరు !” అంటూ తూర్పు గోదావరి జిల్లా రైతు సంఘం నేత రాజశేఖర్ వెల్లడించారు. పంట నష్టం సొమ్మును భూయజమానులకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ సాగుదారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.