ఏపీ వైపు ప్రపంచమంతా చూస్తోంది. నిజమే. ఇక్కడ జరుగుతున్న గొప్ప అభివృద్ధి గురించి కాదు. నీతి బాహ్యమైన వ్యాఖ్యలతో చట్టసభలను ఎలా మైలపరుస్తున్నారని. మొన్నటికి మొన్న శాసన సభ జరిగిన తీరు పట్ల అసహ్యించుకుంటున్నారు. ఏదో పూనకం వచ్చిన వాళ్ల మాదిరిగా ఊగిపోవడం ఏంటని జనం నోటిమీద వేలేసుకుంటున్నారు. ఇళ్లల్లోని మహిళల గురించి గౌరవ అసెంబ్లీలో కించపరుచుకుంటూ మాట్లాడుకునే అరాచక పర్వాన్ని ప్రజలంతా గమనించారు. ఇందుకేనా వీళ్లకు ఓట్లేసి చట్టసభలకు పంపిందంటూ చీదరించుకున్నారు. సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ తాలూకు లక్షణాలు స్పష్టంగా బయటపడ్డాయి.
దిగజారిన వ్యక్తుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని నారా భువనేశ్వరి తన భర్తను ఓదార్చింది. ఇవన్నీ వదిలేసి వరదల్లో చిక్కుకున్న ప్రజల గురించి పట్టించుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని అర్థం కావొచ్చు. సభలో సభ్యులు అన్నమాటలను చంద్రబాబు సీరియస్గా తీసుకుంటే పరిస్థితేంటీ ! అదే ఆమె సీఎం జగన్ ఇంటి ముందు బైఠాయించి నిరూపించమని ఆందోళనకు దిగితే ! డీఎన్ఏ పరీక్షలకు సిద్దమని నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు ! నిరూపించగలరా ? ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు గతంలో జగన్ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు మాట్లాడింది తప్పుకాదా అంటున్నారు. అప్పుడు అలా మాట్లాడడం తప్పని జనమంతా జగన్ కుటుంబానికి అండగా నిలిచారు. ఇలాంటివి ఉపేక్షించినందునే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నసంగతి మరిస్తే ఎలా !
ఇదలా ఉంచితే సభలో వివేకా హత్య గురించి టీడీపీ సభ్యులు ప్రస్తావించారు. అది సీబీఐ విచారణలో ఉంది. న్యాయస్థానం దోషులను నిర్ధారిస్తుందన్న సోయ లేకుండా పాతికేళ్ల నాటి ఘటనలతో ముడిపెట్టడమేంటీ ! చట్టసభల్లో ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై విపక్ష సభ్యులు అడుగుతారు. హుందాగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారపార్టీకి ఉంది. దీనికి భిన్నంగా విపక్షాల నోరుమూయించడానికి ఏదిపడితే అది మాట్లాడతారా ! వివేకా హత్యపై నిజనిజాలను తేల్చాల్సింది అసెంబ్లీ కాదు. సీబీఐ దర్యాప్తు చేస్తుంది. న్యాయస్థానం విచారణ జరుపుతుందని చెప్పొచ్చు కదా ! మాకంటితో మేమే పొడుచుకుంటామా అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది అన్నదమ్ముల మధ్యనేన్న సంగతి తెలీదా ! పోనీ చంద్రబాబే ఈ హత్యకు సూత్రధారి అయితే కేసు ఎందుకు పెట్టలేదు ! సీబీఐ దర్యాప్తులో ఎవర్ని నిందితులుగా పేర్కొంది ! ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు.
కుప్పంలో ఓటమి చంద్రబాబును బాగా కుంగదీసింది. ఓడితే ఎవరికైనా బాధ ఉంటుంది. సహజమే. 40 ఏళ్ల రాజకీయ అనుభశాలి గెలుపోటములను సమానంగా తీసుకోలేకపోవడం వయసు మీద పడడం వల్ల కావొచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల్లో చౌకబారు పోస్టులు పెడుతున్నారు. సీఎం జగన్ తీరు ఇంకా పగాప్రతీకారాలను దాటినట్లు కనిపించడంలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా దుర్లభంగా ఉన్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలి. నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువతకు ఉపాధి ఎలా కల్పించాలి. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు ఎలా తెచ్చుకోవాలి. అకాల భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న రైతన్నలను ఎలా ఆదుకోవాలి అనే అంశాలపై అధికార, ప్రతిపక్షాలు చర్చించి ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలు భావించారు. హైలీ ఎడ్యుకేటెడ్ సభ్యులున్న శాసనసభ నుంచి ఎవరైనా ఇదే ఆశిస్తారు. మరి జరుగుతున్నదేంటీ సార్ ! రాజకీయాల్లో ఉన్నత విలువలు తీసుకొస్తామన్నారు.. గుర్తుందా సార్ !
వాస్తవంగా సభలో జరగవలసిన తీరుకు నిలువుటద్దంగా ఉంది.
yes