ప్రజల కన్నీటితో కడప నగరం ముద్దయింది. పిల్లాజెల్లలతో ప్రాణాలు నిలుపుకోవడానికి జనం పునరావాస కేంద్రాలకు పరుగులు తీశారు. పింఛా నది పొంగి వరద నీరు ఉధృతంగా ఊళ్లను ముంచేసింది. అన్నమయ్య ప్రాజెక్టుకు గండి పడింది. ఇళ్లల్లోకి మోకాల్లోతున నీళ్లు బురదతో మేటేసింది. దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా కడప జిల్లా జల ప్రళయానికి అట్టుడికింది.
అన్నమయ్య ప్రాజెక్టులో చుక్కనీరు లేదు..
అన్నమయ్య ప్రాజెక్టుకు గండి పడడంతో చుక్కనీరు లేకుండా పోయింది. ఇప్పుడు వరద నీటితో అల్లాడుతున్న కడప ప్రజలు మరో రెండు మూడు నెలల్లో తాగు నీటికి కటకటలాడాల్సి వస్తోంది. ప్రస్తుతం సోమశిల బ్యాక్ వాటర్‌తో సగం జిల్లా నీళ్లలోనే నానుతోంది. సుమారు 70 టీఎంసీల నీళ్లు పెన్నా నదికి చేరుతోంది. నెల్లూరులో పెన్నా గేట్లు ఎత్తేసి వరద నీటిని సముద్రానికి వదిలేస్తున్నారు.
బుగ్గవంక రిజర్వాయర్‌కు రక్షణ గోడ నిర్మించకపోవడమే వరద ముంచెత్తింది
బుగ్గవంక రిజర్వాయర్ నుంచి కిందివరకు రక్షణ నిర్మాణం పూర్తి కాలేదు. సీఎం జగన్ మేనమామ రవీంద్రారెడ్డితోపాటు మరికొందరి ఆక్రమణల వల్లే రక్షణ గోడ నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో అధిక వర్షాలకు తరచూ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రక్షణ నిర్మాణం పూర్తి చేయాలి. అస్తవ్యస్తంగా మారిన భూగర్భ డ్రెయినేజి వ్యవస్థను పునర్మించాలి.
ముంపు కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారమివ్వాలి
– సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం కన్నా మానవ తప్పిదం వల్ల జరిగిన నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, ముంపునకు గురైన కుటుంబానికి వెయ్యి నుంచి రెండు వేలు ఇస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఇళ్లలో చేరిన బురదను తొలగించాలంటే కనీసం ఇంటికి ఐదు వేలు ఖర్చువుతుంది. ఇళ్లలో సామగ్రి అంతా కొట్టుకుపోయింది. ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అందువల్ల కుటుంబానికి కనీసం రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలి. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఇలా వరదలు వచ్చినప్పుడు 7 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని నిల్వ చేసుకునే సదుపాయం కల్పించాలి. ప్రస్తుతం మంచినీటి పైపులైన్లు వరదకు కొట్టుకుపోయాయి. తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. వరద సహాయక చర్యలకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెయ్యి కోట్లు వెచ్చించి పనులు చేపట్టాలి.