రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కమలనాధులకు అమిత్ షా గట్టిగానే షాకిచ్చినట్లుంది. వెంటనే అమరావతి మహా పాదయాత్రను భుజానికెత్తుకున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని అంటూ నినదించారు. నెల్లూరు జిల్లా కావలి నుంచి పాదయాత్రలో కాలు మోపారు. అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుంది. రానున్న ఎన్నికల్లో వైసీపీ సర్కారును ఢీ కొట్టేది తామేనని ఢంకా బజాయిస్తున్నారు. అందుకనుగుణంగానే కేంద్రం ఎత్తుగడలు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించలేదని ప్రజల వ్యతిరేకతను అటువైపు తోశారు. తాజాగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఇంకా ఏం చేయబోతున్నారో !
అమిత్ షా దిశా నిర్దేశం ప్రకారం తెలుగు దేశం పార్టీ నుంచి ఎక్కువ మందిని పార్టీలోకి చేర్చుకుంటారు. ఎన్నికల నాటికి టీడీపీని నామమాత్రం చేయాలనే ఎత్తుగడను అమలు చేస్తారు. విశాఖ స్టీలు ప్లాంటుపై జనసేన ఉద్యమిస్తుంది. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని తాత్కాలికంగానైనా వెనక్కి కొట్టిన హీరోగా పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటారు. పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనాల ప్రకారం నిధులు రాబట్టడం ఒక్క పవన్ కల్యాణ్ కే సాధ్యమనిపిస్తారు. ఇంకా రాష్ట్ర విభజన హామీలను సాధించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని ప్రచారమందుకుంటారు. అవసరమైతే ఎన్నికలు సమీపించే నాటికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరోవైపు చంద్రబాబు పార్టీని బలోపేతం చేసుకునేందుకు జవసత్వాలు కూడదీసుకుంటున్నారు. మొన్నటి శాసనసభలో ఎపిసోడ్‌ను పక్కనపెట్టి జనంలోకి మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఖరారైంది. మంగళ, బుధవారాల్లో ఆయన తిరుపతి, కడప, నెల్లూరులో పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈపాటికే ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పార్టీ శ్రేణులను పురమాయించారు. ఈ పర్యటనలో ప్రాజెక్టులు కొట్టుకుపోయి ప్రజలను ముంచేయడానికి ప్రధాన కారణం వైసీపీ సర్కారు నిర్లక్ష్యేమనని తూర్పారబట్టనున్నారు. గడచిన రెండున్నరేళ్లలో బలహీనమైన ప్రాజెక్టుల మరమ్మతులకు ఎంత ఖర్చు పెట్టారనేది ప్రజలకు వివరించనున్నారు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధికార వైసీపీ ఎలాంటి ఎత్తుగడలు అమలు చేస్తుంది ! బలహీనమైన టీడీపీనే తమకు ప్రత్యర్థిగా ఉండేందుకు పావులు కదుపుతారా.. అనే చర్చ ముందుకొస్తోంది. కమలనాధుల ఎత్తుగడ ప్రకారం ఇక్కడ నుంచి రాష్ట్ర సర్కారుకు తన సహకారాన్ని మునుపటిలా అందించకపోవచ్చు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రాభవం తగ్గుతుందనే సర్వేలతో మిత్రులతో కలిసి సీఎం జగన్ బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్దమవుతారా ! ఇటీవల ఒడిశా సీఎం పట్నాయక్, నిన్న కేసీఆర్‌తో కలిసినప్పుడు ఇదే విషయాన్ని చర్చించి ఉంటారనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఏమో.. గుర్రం ఎగరావచ్చు. రాజకీయాలు తారుమారు కావొచ్చు.