రాయలసీమ పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. నిలువ నీడ లేదు. వంట చేసుకోవడానికి పాత్రల్లేవు. దాతలు పెట్టే ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిత్యావసరాలతో అవకాశమున్నచోట వండుకుంటున్నారు. నాలుగు రోజులుగా అంధకారంలో బిక్కుబిక్కుమంటున్నారు. పగటిపూట ఇళ్లలో మేటలను తొలగించుకునే పనిలో తలమునకలవుతున్నారు. ఊళ్లకు ఊళ్లనే వరద ఊడ్చేసింది. కట్టుబట్టలతో మిగిలిన పల్లె వాసులను ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆదుకోవాలి. రాజకీయాలను పక్కనపెట్టి అన్ని పక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరాలి.
“ ఇటీవల తాత్కాలిక కోవిడ్ కేంద్రాలు నెలకొల్పినట్లు జర్మన్ హ్యాంగర్స్ తో టెంట్లు వేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించాం. వాళ్లు స్పందించలేదు. ఎక్కడో దూరంగా మరో ఊరిలోనో.. ఊరికి దూరంగానో స్కూళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలు అక్కడకు వెళ్లడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సాయం ఏ మూలకూ సరిపోదు. వాళ్ల కష్టాలు చూస్తుంటే గుండె చివుక్కుమంటోంది సార్ !” అంటూ కడప సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేట డివిజన్లోని రామచంద్రాపురం, పులపుత్తూరు, మందపల్లి గ్రామాల్లో పరిస్థితి కడు దయనీయంగా ఉందని తెలిపారు.
పునరావాస కేంద్రాలు హైజినిక్గా ఉండకపోవడం, ఊరికి దూరంగా ఉండడంతో గ్రామస్తులు పునరావాస కేంద్రాల్లో ఉండడం లేదు. ఇళ్ల దగ్గరే అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు కుల వివక్ష మరింత ఇబ్బంది పెడుతోంది. దళితులు ఉన్న చోటకు బీసీలు వెళ్లడం లేదు. బీసీలున్నచోట ఓసీలు ఇష్టపడడం లేదు. దీంతో అధికారులు కొన్నిచోట్ల ఎవరికి వారికే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలు గ్రామాల్లోనే నెలకొల్పి జనరేటర్లతో విద్యుత్ సదుపాయం కల్పించాలి. మూడు పూటలా ఆహారం అందిస్తే పగటి సమయంలో తమ ఇళ్లను బాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి బదులు అధికారులు కొవ్వొత్తులు ఇచ్చి సరిపెట్టారు.
చెయ్యేరు, పింఛా నదీ పరివాహక ప్రాంతాల్లోని సుమారు 20 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. అందులో రాజంపేట, నందలూరు మండలాల్లోని కొన్ని గ్రామాలు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూలిన ఇళ్లకు రూ.95,100, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.5,200 ఇవ్వాలని ఆదేశించింది. సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఇది అరకొర సాయమే. పశువులు కొట్టుకుపోయాయి. ఇళ్లల్లో ధాన్యం వరదపాలైంది. ఇంకా విలువైన వస్తువులూ పాడైపోయాయి. వీటి విలువే లక్షల్లో ఉంటుంది.
కేవలం కూలీనాలీ చేసుకొని బతికే కుటుంబాల అవస్థలు అన్నీఇన్నీ కావు. పనుల్లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్నారు. ఇలాంటి దుస్థితి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ నెలకొంది. నష్టం అంచనాలను రూపొందించముందే ఇతోధికంగా సాయమందించాలని అన్ని రాజకీయ పక్షాలు కేంద్రాన్ని కోరాలి. సీఎం వైఎస్ జగన్ మరింత చొరవ తీసుకొని కేంద్రం నుంచి వీలైనంత సాయం రాబట్టేందుకు కృషి చేయాలి.