ఆయనొక ఎమ్మెల్యే. అందులోనూ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి. ప్రభుత్వ విప్ కూడా. సీఎం జగన్‌కు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన తల్చుకుంటే నిమిషాల్లో బోలెడు మంది అనుచరులు అక్కడ వాలతారు. ఏమైందో ఏమో. నేవీ హెలికాప్టర్లో వచ్చిన నిత్యావసర సరకులను సకాలంలో దించాలనే ఆతురతలో చొక్కా విప్పాడు. కార్యకర్తలతో కలిసి బియ్యం మూటలను హెలికాప్టర్ నుంచి దించారు. అది కష్టంగా భావించలేదు. తన నియోజకవర్గ ప్రజలకు వచ్చిన కష్టం మందు తన శ్రమ ఎంతనుకున్నాడు. వేగంగా అన్లోడ్ చేసి అక్కడ నుంచి సరకులను తరలించారు. ఆయనే చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.
చెవిరెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రెండేళ్ల క్రితం తొలి కరోనా లాక్ డౌన్ సమయంలో ఆయనకు ప్రజల పట్ల ఉన్న అభిమానం ఏంటో ప్రపంచానికి తెలిసింది. వేల మంది అనుచరులతో కలిసి నియోజకవర్గంలోని సుమారు 1.25 లక్షల కుటుంబాలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనివ్వకుండా కాపాడుకున్నారు. అవసరమైనంత నిత్యావసరాలతోపాటు మందులు ప్రతీ ఇంటికీ అందించారు. బలవర్థకమైన ఆహారం తీసుకుంటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గుర్తించి ఇంటింటికీ తాజా కూరగాయలు నిత్యం అందించారు. ఇలా కోట్ల రూపాయలు ముందుగా తన జేబు నుంచే ఖర్చు పెట్టారు. ఆనందయ్య మందు కోవిడ్ నిరోధానికి పనిచేస్తుందని తెలుసుకున్న వెంటనే ఆనందయ్య అనుచరులను రప్పించారు. నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికీ మందు అందించారు. అదీ ఇదన్లేదు. ఫలానా ఊళ్లో ఫలానా కుటుంబానికి ఆపద వచ్చిందంటే.. నేనున్నానంటూ అక్కడ వాలిపోతారు. అదీ చెవిరెడ్డి నైజం. మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తేనో తప్ప అది సాధ్యం కాదు. మీ కష్టం ఊరికే పోదు. హ్యాట్ఫ్సాఫ్ యూ సర్ !