రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ సవరణ చట్టాన్ని ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. ఇకపై సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో ప్రభుత్వమే విక్రయిస్తుంది. ఎన్నిరోజులు ఆడినా.. ఏ షోకైనా ఒకే ధర ఉంటుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మూడు కోట్లతో నిర్మించిన చిత్రమైనా.. రూ.300 కోట్లతో తీసిన సినిమా టిక్కెట్ల ధరలో మార్పు ఉండదు. రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శిస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్రసీమ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు.
సినిమాటోగ్రఫీ సవరణ చట్టంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతారని సినీ పెద్దలు వాపోతున్నారు. బెన్ఫిట్ లేదా అదనపు షోలను అనుమతించకుంటే ఎలా అని గుర్రుగా ఉన్నారు. సినిమా నిర్మాణానికి వెచ్చించిన సొమ్ము వారం పది రోజుల్లో రాబట్టుకోకపోతే నష్టపోతామనే భావన నిర్మాతల్లో నెలకొంది. ప్రభుత్వ సవరణ చట్టంతో సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బగా పేర్కొంటున్నారు. ఈ రంగంపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇక సినిమాలు తీయలేమన్నంతగా బాధపడుతున్నారు.
వాస్తవాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం చిత్రసీమలో పనిచేస్తున్న టెక్నిషియన్స్, ఇతర నటులకు దక్కేది స్వల్ప వేతనాలే. రోజుకు రూ.500 నుంచి వెయ్యి రూపాయలకు పనిచేసేవాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లకు వచ్చిన నష్టమేమీ లేదు. హీరో, హీరోయిన్, దర్శకులకే అధిక మొత్తంలో ప్యాకేజీలుంటాయి. ఓ ప్రేక్షకుడికి వినోదం పంచడానికి, సందేశాత్మకంగా సినిమా నిర్మించడానికి వందల కోట్లు వెచ్చించాల్సిన అవసరం లేదు. హీరోయిజాన్ని తలకుమించిన మోతాదులో చూపించడానికి, మితిమీరిన అశ్లీలత, భారీ సెట్టింగులతో ప్రేక్షకుడ్ని ఊహల్లో విహరింపజేయడానికి మాత్రమే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
ఓ సామాన్యుడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వివిధ పాత్రల్లో చూపడానికి కోటాను కోట్లు తగలెయ్యాల్సిన అవసరం లేదు. ఇటీవల వస్తున్న చిన్న బడ్జెట్ చిత్రాలు పెద్ద ఎత్తున ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ఈమధ్యనే ఓటీటీలో విడుదలైన జైభీమ్ ప్రపంచంలోనే నంబర్ వన్ చిత్రంగా గుర్తింపు పొందింది. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. నేడు సినిమా ఇండస్ట్రీ కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లో బందీ అయ్యింది. వాళ్లకు కోట్లు కుమ్మరించిపెట్టే పరిశ్రమగా కొనసాగించడానికి వీల్లేదు. ఓరకంగా చెప్పాలంటే చిత్రసీమకు ఆ కుటుంబాల నుంచి ఈ చట్టంతో విముక్తి లభించినట్లే.