వరద భీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు పాటించలేదు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు ఆలస్యంగా స్పందించారు. కడపలో అన్నమయ్య ప్రాజెక్టు కు మరమ్మతులు అవసరమని అధికారులు చెప్పినా ప్రభుత్వం స్పందించలేదు. పెన్నా నదికి ఒక్కసారిగా సుమారు 5.4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. ఇలా రకరకాల కారణాలతో ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసించారు. అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు మూడు రోజుల పర్యటనలో వరద బాధితులు పోటెత్తారు. నిలువ నీడ లేకుండా సర్వం వరదలో కొట్టుకుపోయాయని కన్నీరుమున్నీరయ్యారు. కట్టుబట్టలతో మిగిలిపోయామని కుమిలిపోయారు. ఇతోధికంగా సాయం అందించేట్లు చూడాలని చంద్రబాబును వేడుకున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో గురువారం చంద్రబాబు పర్యటించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. ఆయా కుటుంబాలకు పార్టీ నుంచి రూ. లక్ష చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా కట్టిస్తామన్నారు. తక్షణ సాయంగా వెయ్యి రూపాయలు అందించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలతో మద్యం తాగించి సంక్షేమ పథకాలు ఇస్తామంటున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నానని విమర్శించారు. సొంత జిల్లా కడప వరదలకు అతలాకుతలమైతే సీఎం జగన్ ప్రజలను పరామర్శించడానికి రాలేదని విమర్శించారు. ఇష్టారీతిన తీసుకొచ్చిన అప్పులు చేం చేశారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. వరద భీభత్సానికి దెబ్బతిన్న కటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర సర్కారు ఇతోధికంగా ఆదుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇదే జిల్లాలో మూడు రోజుల క్రితం ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటనకు వెళ్తే ప్రజలు అడ్డుకోవడం విశేషం.