నిజమే. బీపీ వస్తే అది కొందరికే ప్రయోజనం. మరికొందరి కొంప కూల్చేస్తుంది. ఈసంగతి తెలియని చంద్రబాబు బీపీ పెంచుకున్నట్లు కనిపిస్తోంది. గాల్లో తిరిగినోడు గాలోనే కలిసిపోయాడని వ్యాఖ్యానించారు. ఇప్పుడు గాల్లో పర్యటించినోడు కూడా ఎప్పుడో ఇదే గాల్లో కలిసి పోతాడని బీపీ పెరిగి వ్యాఖ్యానించారు. బ్లడ్ ప్రెజర్ ఎవరికైనా పెరుగుతుంది. కాకుంటే అది పెరిగినప్పుడు చేసే వ్యాఖ్యలు కొందరికే ప్రయోజనం. మరికొందరికి నష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా బీపీలు పెంచుకుంటే ఏమవుతుందంటే..
వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆ ఘటనకే పరిమితం కావాలి. కష్టాల్లో ఉన్నోళ్లకు తానున్నాననే భరోసా ఇవ్వాలి. వీలైనంత సాయం చేయడం ఒక ఎత్తయితే ఈ ఉత్పాతానికి దారితీసిన అంశాలపై విచారణను పట్టుబట్టాలి. మానవ తప్పిదం ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి. అవసరమైతే బాధితుల పక్షాన పోరాడాలి. అంతేగానీ బీపీ పెంచుకొని ఏది పడితే అది మాట్లాడితే.. అది మనకొంపే కాల్చేస్తుందనేది టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకున్నట్లు లేదు. ఇదేంటీ ఇలా ప్రవర్తిస్తున్నారని వరద బాధితులు ముక్కున వేలేసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్సార్ గురించి మాట్లాడేటప్పుడు కొంత సోయ ఉండాలి. వాళ్లు చేసిన పనుల్లో కొన్ని తప్పులున్నా ఒప్పులే ఎక్కువున్నాయి. అందుకే ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఆరాధ్య దైవంగా పూజించారు. అలాంటి నేతలపై మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ వదిలేసి బీపీ పెరిగి మాట్లాడితే అసలుకే మోసం వస్తోంది. ఇటీవల సీఎం జగన్ అభిమానులకు బీపీ పెరిగితే ఆ పార్టీ అభిమానులు టీడీపీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులన్నీ ఏకతాటిపై నిలిచి చంద్రబాబుకు అండగా నిలిచాయి.
అదే చంద్రబాబుకు బీపీ పెరిగి మాట్లాడితే ఆ పార్టీ శ్రేణులు వైసీపీ కార్యాలయాలను ధ్వంసం చేయలేదు. చంద్రబాబు ఎలాంటి మానసిక స్థితిలో ఇలా మాట్లాడారు.. ఎందుకు మాట్లాడారు.. దీని వెనుక పార్టీ ప్రయోజనాలేంటీ, చంద్రబాబుకు వ్యక్తి గతంగా ప్లస్ అవుతుందా కాదా అని టీడీపీ శ్రేణులు ఆలోచిస్తాయి. అందువల్ల చెప్పొచ్చేదేమంటే.. బీపీ అన్ని వేళలా అందరికీ ఒకే ప్రయోజనం కలిగించదు. ఇది తెలియకే జనంలో చులకనవుతుంటారు. ఇప్పుడు ఎవరు ఎందుకు ఎప్పుడు బీపీ పెంచుకోవాలో తెలుసుకోవాడానికి బీపీ అంకగణితాన్ని పాటించాలి. లేకుంటే దబిడి దిబిడే మరి.