అవును. మార్పు, మరక మంచివే. సమస్యల కొలిమిలో మండితేనే ఎవరికైనా పరిపూర్ణ రూపం సంతరించుకుంటుంది. కష్టాల కడలిలో ఈదితేనే మానసిక స్థయిర్యం మరింతగా పెరుగుతుంది. దెబ్బ మీద దెబ్బ పడేకొద్దీ మరింత రాటు దేలతారు. ఉన్నత స్థితికి చేరేందుకు అదే సోపానమవుతుంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండని పాదయాత్రలో ప్రజలను అభ్యర్థించినప్పుడే సీఎం జగన్‌లో కొంత పరిణతి వ్యక్తమైంది. అధికారానికి వచ్చాక అది మరో రూపం తీసుకుంది.
సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా ఉండేవారో అందరికీ తెలుసు. అప్పటి బాడీ లాంగ్వేజీ టూ డిఫరెంట్ గా ఉండేది. అధికార పగ్గాలు చేతికొచ్చిన ఉత్సాహం ఉరిమేది. 151 మంది ఎమ్మెల్యేల బలంతో తాను అనుకున్నది ఏదైనా చేసెయ్యొచ్చు. కొండ మీద కోతినైనా లాక్కొచ్చి ఎదురుగా నిలబెట్టొచ్చనేంత విశ్వాసం తొణికిసలాడేది. పరిస్థితులు ఎలా ఉన్నా… ఏమైనా సరే. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదన్నట్లుండేది. ఆయన నోటి మాటే జీవోలుగా వచ్చేవి. ఎనలేని ఆత్మస్థయిర్యం ఉట్టిపడేది. కళ్లు మూసుకొని మూడు రాజధానుల బిల్లును సభలో పెట్టారు. మండలిలో వీగిపోయింది. శాసన మండలినే రద్దు చేయాలని తీర్మానం చేశారు. న్యాయ సమీక్షకు నిలవని జీవోలపై న్యాయమూర్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. ప్రజలు ఇంతటి విజయాన్నిస్తే శాసనాలు చేసే అధికారం మాకు లేదా అనేంతగా వెళ్లిపోయారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో కీలకమైన నవ రత్నాల అమలుకు పూనుకున్నారు.
అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆది నుంచి సంపన్నుడిగా ఎదిగిన జగన్‌ను ఇవి మరింత చికాకు పెట్టాయి. రోజువారీ పనిలో ఎక్కడ.. ఎటు నుంచి ఎలా అప్పులు తేవాలనే దానిపైనే కసరత్తు చేసేది. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన నిధుల వేటతోనే సరిపోయేది. మరోవైపు అధికారులు విడుదల చేస్తున్న జీవోలు అన్నీ న్యాయస్థానాల్లో సమీక్షకు నిలవడం లేదు. విపక్షం ప్రతీ అంశంపై న్యాయస్థానాల్లో కేసులు వేస్తుంటే.. వాటి నుంచి తెప్పరిల్లుకోవడం గగనమైంది. జీవోల రూపకల్పన విషయంలో అధికారులు సీఎంకు ఎదురు చెప్పలేక ఇలా చేస్తున్నారో.. లేక అవగాహనా రాహిత్యంతో చేస్తున్నారో అర్థంగాక తలపట్టుకోవాల్సిన స్థితి ఏర్పడింది. చివరకు న్యాయస్థానాల్లో అధికారులు తలదించుకునేదాకా వెళ్లింది. ఇది ప్రభుత్వ పరువు ప్రతిష్టను మరింత దిగజార్చింది.
ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతులు అర్థమయ్యాయి. వచ్చే ఆదాయమెంత.. ఖర్చెంతనే అంచనా తెలిసింది. దీనికనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు. కారణాలు ఏం చెప్పినా కొన్ని పథకాలు వాయిదా వేయడం, మరికొన్నింటి వ్యయాన్ని మరింత తగ్గించుకుంటూ వస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన నుంచి వెనక్కి మళ్లారు. శాసన మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. ఉన్నత న్యాయస్థానంలో దీనిపై కేసుల్లేకుండా ఉంటేనే ప్రపంచబ్యాంకు అప్పు రూ. 50 వేల కోట్లు వస్తుంది. ఒకసారి హైకోర్టులో అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నట్లు అఫిడవిట్ వేశాక.. మళ్లీ మూడు రాజధానుల ప్రస్తావన కుదరదు. ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే ఆ రుణమే కీలకం. ముందుగ చెప్పినట్టు మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చు. ఇలా రెండున్నరేళ్లలో వచ్చిన అనుభవంతో సీఎం జగన్ కొత్త అడుగులు పడనున్నాయి.