బాల్యంలో మిత్రుడికి ఏదైనా కష్టం వస్తే పిల్లలంతా జేబుల్లో ఉన్నది తీసి ఇచ్చేది. మేమున్నామనే ఓ భరోసా కల్పించేది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కలిసికట్టుగా ముందుకు సాగేది. వావ్ ! అసలు ఆ రోజులే వేరని తల్చుకుంటాం. రాయలసీమలోని పల్లెలు వరదలకు విలవిల్లాడుతుంటే జన సైనికుల స్పందన కూడా ఇలాగే ఉంది. ఏ ఊరికాఊరు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎక్కడివాళ్లక్కడే తమ ఇళ్లల్లో ఏది ఉంటే అది తీసుకొచ్చి పంచుతున్నారు. నిలువ నీడలేక కట్టుబట్టలతో అల్లాడుతున్న అభాగ్యులకు తామున్నామనే ధైర్యాన్నిస్తున్నారు.
వాళ్లంతా రాజకీయాల్లో తలపండినోళ్లు కాదు. రాజకీయంగా గుర్తు పెట్టుకోగలిగిన పర్సనాలిటీలూ కాదు. అయినా తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అభిమానం కావొచ్చు. లేదా ఆయన నిర్దేశించిన ప్రజాసేవే పరమార్థమని గ్రహించి ఉండొచ్చు. పాతికేళ్ల యువకులంతా కలిసి కడప జిల్లా రాజంపేట డివిజన్లోని నందలూరు, మందపల్లి తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్తున్నారు. తమకు అందుబాటులో ఏది ఉంటే అది చేతిలో పెట్టి ధైర్యం చెబుతున్నారు. కొట్టే శ్రీహరి కువైట్‌లో ఉన్న మిత్రుల నుంచి విరాళాలు సేకరించారు. వాటితో ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి వినుత కోట లాంటి నాయకులు విదేశాల నుంచి వచ్చిన విరాళాలతో పరిసర గ్రామాల్లో ప్రజలకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇలా ఎక్కడకక్కడే యువత స్పందిస్తున్న తీరు అబ్బురమనిపిస్తోంది. ఏమైనా జనసైనికుల ఉత్సాహమే వేరు. ఆవేశమొచ్చినా.. ఆలోచన కలిగినా వాళ్లను ఆపడం ఎవరి తరం !
వరద భీభత్సం.. మానవ తప్పిదం : నాదెండ్ల మనోహర్
పింఛా, చెయ్యేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుకాసురుల వల్లే వరదలకు కారణమని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. సీమలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎక్కడికక్కడ జనసైనికులు బాధితులను ఆదుకుంటున్న తీరును ప్రశంసించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల కోసం అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తి నీటిని విడుదల చేసి ఉంటే ప్రాజెక్టు కొట్టుకుపోయేది కాదన్నారు. దీనిపై ప్రభుత్వం చిత్తశుద్దితో విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.