టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిన్న పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాదు. వరద బాధితులకు సాయం పెంచాలనీ కాదు. కౌలు రైతులుగా కునారిల్లుతున్న ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీలను ఆదుకోవాలనీ దీక్ష చేయలేదు. ఇంతకీ ఆయన నిరసన ఎందుకంటే.. నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలకు జూనియర్ ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదని. వైసీపీ నేతలను చంపుతా.. నరుకుతానంటూ ఆవేశం ప్రదర్శించలేదని. ఇలాంటి ఉక్రోషాలే ఆ పార్టీని పాతాళానికి తొక్కేస్తున్నాయి.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా నటుడు మాత్రమే. మేనత్త గురించి అసెంబ్లీలో తప్పుగా మాట్లాడినందుకు చాలా హుందాగా స్పందించారు. రాజకీయ విమర్శలకు పరిమితం కావాలే గానీ ఇలా మహిళల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ అరాచకత్వాన్ని ఇకనైనా ఆపాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు మాత్రం జూనియర్ స్పందనపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఉగ్ర రూపమెత్తి పదడుగులు ఎత్తు లేస్తారని ఊహించారు. వాటిని ఆయన పటాపంచలు చేశారు. ఆ ఉక్రోషం పట్టలేక వర్ల రామయ్య నిరసన దీక్ష చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ను కించపరుస్తూ రామయ్య మాట్లాడడం సరికాదంటూ నెల్లూరు జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్కి ఎన్టీఆర్ అభిమానులు అడ్డం పడ్డారు. ఇది సరైన పద్ధతి కాదంటూ నిరసన తెలిపారు. గతంలో చంద్రబాబు కుప్పం పర్యటనల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి ఎప్పుడు తీసుకొస్తారని అభిమానులు ఫ్లెక్సీలతో నినదించారు. నాడు చంద్రబాబు తల దించుకొని మౌనం వహించారు తప్ప ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కనీసం ఒక్క మాట కూడా ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని బుచ్చయ్య చౌదరిలాంటి సీనియర్ నేతలు ఎన్నిసార్లు అడిగినా జూనియర్ స్పందించలేదు. సినిమా రంగంలో ఇంకా ఎదగాల్సి ఉన్నందున తాను రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పేశారు. అయినా ఇంకా ఆయన్ని ఏదో కారణంతో పార్టీలోకి లాగాలని ప్రయత్నించడం వృథా ప్రయాస. ఇప్పుడు జూనియర్ స్పందన పై నిరసన వ్యక్తం చేయడం పార్టీకి మరింత నష్టం. అయినా ప్రజలు ఓట్లు వేయలేదని ఉక్రోషం వెళ్లగక్కే నేతలకు ఇవి రుచించవేమో !