మార్కెట్లో కిలో టమాటా రూ.100. వంద నోటు ఇస్తే తప్ప గుప్పెడు కాయలు చేతబడే పరిస్థితి లేదు. ఒక్కో రైతు లక్షలు కళ్ల చూస్తున్నాడు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. పత్తికి డిమాండ్. కందికి డిమాండ్. ఉల్లికి డిమాండ్. వంకాయకు డిమాండ్. ఉన్న పంట పీకేసి రేటు పలికే పంటను హడావుడిగా వేసినవారెందరో! మందులు కొట్టి హైబ్రిడ్ రకాలను పెంచిన చేలు ఎందరివో! ఎల్లకాలం అలాగే ఉండదు. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి కూడా రాని దైన్యం. ఇంకోసారి బంపర్ డ్రా తగులుతుంది. రైతుకు చెలగాటం. రైతు భార్యకు ప్రాణ సంకటం. అవును ! ఆమె అతని ఇల్లాలు. అతనికి సగపాలు. ఆమె కూడా కష్టం చేస్తుంది. ఆమె కూడా పొలంలో చెమట చిందిస్తుంది. ఎన్నడైనా లెక్కించామా?
అట్లాంటి ఓ ఇల్లాలితో భర్త గొడవేసుకున్నాడు. మంచి ధర ఉంది. టమాటా వేయాలి. లక్షలు కళ్ల చూడాలి. మరి డబ్బు? పేరుకే రైతు రారాజు. అతని దగ్గర డబ్బెక్కడిది? అందుకే భార్య కమ్మల మీద కన్ను పడింది. తాగటానికా.. ఊరేగటానికా.. పొలానికే కదా.. ఇవ్వు అన్నాడు. ఇవ్వడం ధర్మం అన్నాడు. సరే ! ఇవాళ్టి రేటు రేపటికి ఉంటుందా? ఇవాళ వేసిన పంట ఎదిగేదాకా నిలుస్తుందా? హడావుడిగా మందులు, మాకులూ వేసి పెంచే పంట నోట్లో పెట్టగలమా? అదంతా నాకు తెలియదు. పెట్టుబడి కావాలి. అందుకు నీ బంగారం కావాలి. ఇచ్చెయ్యన్నాడు. అడిగాడు. గదిమాడు. ఉరిమాడు. కొట్టాడు. వ్యవసాయం జూదంలా మారింది. డబ్బు పోస్తే తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. వినేలా లేడు. పుట్టింటి కమ్మలు. తల్లి కమ్మలు. ఇస్తే తిరిగొస్తాయా? వచ్చేలా ఉందా రైతు పరిస్థితి? టమాటా ఉంచుతుందా? కొంప ముంచుతుందా? చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం దిగువబురుజుకు చెందిన రచయిత్రి యండపల్లి భారతి 2018లో రాసిన ‘జూదం’ కథ ఇది. ఒకప్పుడు ధర్మజుడు భార్యను జూదంలో పెట్టారు. ఇప్పుడు వ్యవసాయంలో భార్య పరువును, పంటనూ, బంగారాన్నీ పెడుతున్నారు. పంతం మగవాళ్లది. కష్టం ఆడవాళ్లది. ఏం గోస ఇది?
ప్రకాశం జిల్లాలో ఇది మరో కథ. కరువు కన్నీళ్ల కథ. కరువొస్తే వచ్చింది. కష్టం తేనే తెచ్చింది. కిందా మీదా పడి బతుకు బండి లాగాలి కానీ అధైర్యపడితే ఎలా? మగవాడివి. పుస్తె కట్టిన మొగుడివి. పిల్లల్ని గన్న తండ్రివి. ఇల్లు వదిలి వెళ్లిపోతే ఆ ఇంటామెకు ఎవరు దిక్కు! ఏది దారి? అదంతా మగవాళ్లకు పట్టదు. పూలమ్మిన చోట కట్టెలమ్మలేక ఎటో పోయాడు. భార్యాబిడ్డలు అనాథలయ్యారు. ఆమె ఒక్కతి. తోడుగా కడుపున పుట్టిన పిల్లలు. కడుపు నిండని పిల్లలు. ఎటు పోవాలి? ఎవరిని అడగాలి? అప్పుల్లోళ్లు ఊరుకోరు. ఊరు దాటితే తప్పించి దిక్కు లేదు. పుట్టిల్లు చేరింది.
అదేమైనా మారాజుల ఇల్లా? దరిద్రం తాండవించే కొంప. తల్లిదండ్రులున్నారు. అన్నావదినలున్నారు. కానీ సిరి లేదు. వదిన మంచిదే! కానీ కరువు గాలికి మంచితనం నిలిచేది ఎంతసేపు? పిల్లలతో సహా ఆడబిడ్డ వచ్చి రోజుల కొద్దీ ఉంటే సహించేది ఎవరు? ఆమె కష్టం తెలియంది కాదు. కానీ తీర్చేది ఎలా? ఏం చేసి? ఎన్నాళ్లు? రుసరుసలు, సూటిపోటి మాటలు మొదలయ్యాయి. ఇక ఆ ఇంట్లో ఉండొద్దని అనిపించింది. ఈ లోకమే వద్దనిపించింది. ఊరు చివర బావి దాకా వెళ్లింది. దూకుదామంటే పిల్లలు గుర్తొచ్చారు. వెనక్కి వచ్చింది. రాత్రికి రాత్రే పిల్లల్ని తీసుకుని ఎటో వెళ్లిపోయింది. ఎటు? ఎటో అటు. తనూ తన పిల్లలూ బతకలేకపోయారు. అది చాలు. 2003లో ప్రకాశం జిల్లాకు చెందిన రచయిత మంచికంటి వెంకటేశ్వరరెడ్డి గారు రాసిన ‘మిత్తవ’ అనే కథ ఇది. మిత్తవ అంటే ‘మృత్యువు’, ‘ఆపద’ అని అర్థం. ఈ ప్రపంచంలో ఆడదానిగా పుట్టడం కంటే పెద్ద ఆపద ఏముంది?
రైతు పుట్ల కొద్దీ ధాన్యం పండిస్తాడు. ఆహా అనుకుంటాం. కర్షకుడు సాగులో నూతన పద్దతులు పాటించి జాతీయ అవార్డు అందుకుంటాడు. మెచ్చుకుంటాం. చాలా సార్లు అప్పుల్లో మునిగిపోతాడు. అయ్యో అని జాలి చూపిస్తాం. కానీ రైతుకు భార్య ఉంటుందన్న విషయం మర్చిపోతాం. ఆమె ఊసును వదిలేస్తాం. కష్టాన్ని గమనించం. రైతుకు చాలా బాధలు, భయాలుంటాయి. రైతు భార్యకు వాటిని తట్టుకుని నిలబడే ధైర్యం, స్థైర్యం ఉంటుంది. మనం అవేమీ చూడం. “అయ్యలారా! రైతులతోపాటు పొలం పోయేది మేము. కొడవలి పట్టేది మేము. కంకి కోసేది మేము. కూలీలకు సంగటి కాసేది మేము. వర్షానికి పంట నీళ్లపాలైతే ఏడ్చే పెనిమిటిని ఓదార్చేది మేము. మళ్లీ పెట్టుబడికి నగలు ఒలిచి ఇచ్చేది మేము. అప్పులకు తాళలేక అతను పురుగుల మందు తాగితే, ఏడుస్తూ పిల్లల్ని పెంచేది మేము.” అని ఎలుగెత్తి మహిళలు చాటే రోజు ఒకటి వస్తుంది. అప్పటికి గానీ రైతుల భార్యల ఇబ్బందులు మన కళ్లబడవు. వాళ్ల కష్టాలు మన దాకా చేరవు. భూసారం కొలిచేందుకు పరీక్షలున్నాయి. వీళ్ల బాధలు కొలిచే పరీక్షలేవి? ఎటువంటి కథలు ఇవి. ఇప్పటికీ మారని కథలు. తెలుగు కథలు.
courtesy by : వైఎస్సార్ వీర్రెడ్డి, మండపేట, తూర్పు గోదావరి జిల్లా