అసెంబ్లీలో తనపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపిన వారందరికీ నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు జరిగిన అవమానాన్ని తన తల్లికో, భార్యకో, చెల్లికో జరిగినట్లు స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అండగా నిలిచిన వారందర్నీ జీవితంలో మర్చిపోలేనన్నారు. చిన్పప్పటినుంచి తన తల్లిదండ్రులు ఎన్నో విలువలతో పెంచినట్లు ఆమె వెల్లడించారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరించకూడదని సూచించారు. ఇలాంటి అవమానం మరోసారి ఎవ్వరికీ జరగకూడదన్నారు. కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవడమే జీవిత పరమార్థంగా భువనేశ్వరి వెల్లడించారు.
నారా భువనేశ్వరి చాలా హుందాగా స్పందించారు. అచ్చం మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్లాగే ఆమె విడుదల చేసిన ప్రకటన ఉంది. ఇప్పటిదాకా ఆమె కుటుంబానికే పరిమితమయ్యారు. కేవలం వ్యాపారాలు చూసుకోవడానికే సమయమంతా వెచ్చించారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనతో ఇప్పుడు ఒక్కసారిగా ఆమె వార్తల్లోకి వచ్చారు. ఇక్కడ నుంచి ప్రజా క్షేత్రంలో అడుగు పెడతారని టీడీపీ వర్గాల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఇలా మూర్తీభవించిన హుందాతనాన్ని ప్రదర్శించే వాళ్లు రాజకీయాల్లో అవసరమనేది ప్రజల్లో కూడా బలంగా ఉంది. ఈ తరుణంలో ఆమె రాజకీయ ఆరంగేట్రం చేస్తారని ఇటు పార్టీ వర్గాల్లో, అటు ప్రజల్లోనూ ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి.
ఈపాటికే ఎన్టీఆర్ కుటుంబం నుంచి భువనేశ్వరి సోదరి పురందేశ్వరి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. బాలకృష్ణ సినిమాలకే పరిమితం కాకుండా ఆయన కూడా పాలిటిక్స్‌లో కొనసాగుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తండ్రి బాటలో నడిచి పార్టీ కోసం పనిచేశారు. సినిమా రంగంలో తన కెరీర్‌కు ఇబ్బందులు తలెత్తుతాయని భావించి రాజకీయాల నుంచి వెనుదిరిగారు. ప్రస్తుతం భువనేశ్వరికి జరిగిన అవమానంపై స్పందించారు. ఈవిషయంలో చంద్రబాబుకు అండగా నిలుస్తామన్నారు. మహిళలను కించపరిచే అరాచక పాలనకు తెరదించాలని కోరారు. అత్తా అల్లుళ్ల స్పందన ఎంతో హుందాగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భువనేశ్వరి రాజకీయాల్లోకి అడుగు పెడతారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో మరి.