రెండు రోజుల క్రితం అసెంబ్లీలో రెవెన్యూశాఖ మంత్రి చెరువుల ఆక్రమణలపై దృష్టిసారిస్తామని ప్రకటించారు. ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లయినా ఉపేక్షించేది లేదని ఢంకా బజాయించారు. రాయలసీమలో చెరువుల ఆక్రమణల వల్లే వరద ముంపునకు గురై జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద నీరు పోయే మార్గాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డు కట్టలు వేసినందు వల్లే ఇంతటి భీభత్సానికి కారణమైంది. అందువల్ల ఆక్రమణల చెర నుంచి చెరువులను విముక్తి చేస్తామని విత్తమంత్రి సెలవిచ్చారు. ఆనక వాళ్లంతా తమకు ఓట్లు వేయించే పెద్ద మనుషులని వదిలేస్తారా ! లేక నిజంగానే ఆక్రమణల నుంచి చెరువులను రక్షిస్తారా అనేది ప్రభుత్వ చిత్తశుద్దిని బట్టి ఉంటుంది.
2016లో నీరు, చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణలను తొలగించాలని అ ప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. కొన్ని నెలల సర్వే అనంతరం ప్రకాశం జిల్లాకు సంబంధించి పీసీ పల్లి మండలంలో ఒకటి, హనుమంతునిపాడు మండలంలో మరో చెరువును కొందరు వైసీపీ నేతలు ఆక్రమించుకున్నట్లు తేల్చారు. రాష్ట్రంలో ఈ రెండు చెరువులేనా ఆక్రమణకు గురైందీ ! ప్రభుత్వాల ఆరంభశూరత్వానికి ఇదో నిదర్శనం. ఇటీవల చంద్రబాబు తిరుపతిలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించినప్పుడు తుమ్మల చెరువు ఆక్రమణల గురించి అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
2007లో ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైనా ప్రభుత్వ బంజర్లు, వాగులు, వంకల గురించి పెద్ద ఎత్తున సర్వే చేయాలని నిర్ణయించారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద ప్రకాశం జిల్లాలోని అప్పటి మార్టూరు నియోజకవర్గంలో సర్వే చేశారు. దాదాపు ఆరు మండలాల పరిధిలో సుమారు 14 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు అప్పటి జాయింట్ కలెక్టరు సిద్దార్థ జైన్ గుర్తించారు. వెంటనే అక్కడ నుంచి బదిలీ అయ్యారు. ఇదేనా ప్రభుత్వ చిత్తశుద్ది అంటూ జనం నోటిమీద వేలేసుకున్నారు.
ఏదైనా ఘోరం జరిగినప్పుడు బాధితులను సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు ఇలా స్పందిస్తుంటాయి. వాస్తవానికి చెరువులు, ప్రభుత్వ భూములు, ఇతర వాగులు, వంకలను ఆక్రమించే ధైర్యం ఓ పేదోడు చేయగలడా ! అంగబలం, అర్థబలంతోపాటు రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు మాత్రమే ఇంతటి టెంపరితనానికి పాల్పడతారు. ఈ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు వేయించేది వాళ్లే. పార్టీలకు చందాలిచ్చేదీ వాళ్లే. అలాంటి అక్రమార్కుల ఆక్రమణ చెర నుంచి చెరువులను ఈ ప్రభుత్వం కాపాడుతుందా ! రెవెన్యూ మంత్రి ప్రకటన ఏమేరకు అమలు జరుగుతుందో చూద్దాం !
Good story sir
ఈ పని చేయగలిగితే జనాలకి ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది. కానీ ఇది సాధ్యమేనా అని అందరికి అనుమానం,??
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే