అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు వైసీపీ ఎమ్మెల్యే మద్దతు. ఇది ఊహాగానం కాదు. నిజమే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. పాదయాత్ర చేస్తున్న రైతుల విడిది వద్దకొచ్చి ఏ అవసరం ఉన్నా తనకు కాల్ చేయమని చెప్పారు. అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. దీంతో అధికార వైసీపీలో ఎడతెగని చర్చలు మొదలయ్యాయి. టీడీపీ నడిపించే రాజధాని రైతుల ఉద్యమానికి శ్రీధర్‌రెడ్డి మద్దతు తెలియజేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక అసలు కథేంటో త్వరలో బయటకు రావొచ్చు.
మరోవైపు మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఉపసంహరణ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇందులోనూ మూడు రాజధానులపై అంశాన్ని పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలో దీనిపై తగు నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ అడ్వకేట్ వెల్లడించారు. ఫిర్యాదు దారుల తరపున న్యాయవాదులు విచారణ కొనసాగించాలని వాదించారు. మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ సంతకం పెండింగ్ ఉన్నందున న్యాయస్థానం డిసెంబరు 27కు కేసును వాయిదా వేసింది. అమరావతి అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే దానిపై స్టాటస్ కో ఆర్డర్‌ను కొనసాగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచబ్యాంకు దగ్గర రూ.50 వేల కోట్ల రుణం పొందేందుకు కసరత్తు చేస్తూనే ఉంది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం న్యాయస్థానంలో బిల్లును ఉపసంహరించుకుంది. ఒకవేళ మూడు రాజధానుల వైపే ప్రభుత్వం మొగ్గుచూపితే రుణం ఇవ్వకుండా ప్రపంచబ్యాంకు మోకాలడ్డే అవకాశముంది. అయినా ఉపసంహరణ అఫిడవిట్లో ఎందుకు పేర్కొన్నారనేది స్పష్టం కావడం లేదు. ప్రభుత్వ ఎత్తుగడకు తగ్గట్లే హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉన్న స్టాటస్ కో ఆర్డర్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిపై రాష్ట్ర సర్కారు దోబూచులాట ఇలా ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న రైతులకు అండగా ఉంటానని చెప్పడం చర్చనీయాంశమైంది.