ఏపీలో వింత పరిస్థితి తలెత్తింది. గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను గుట్టుచప్పుడుగాకుండా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీలో ఉన్న డిపాజిట్లలో రూ.400 కోట్లు తీసేసుకుంది. ఇంకా జీవితా బీమా సంస్థలో అభయ హస్తం కింద ఉన్న వెయ్యి కోట్లను సెర్ప్ కిందకు తీసుకొచ్చింది. ఇంకా ఏఏ శాఖల్లో ఎంతెంత ఉన్నాయో ఆరా తీసి మొత్తం బయటకు లాగి పబ్బం గడుపుకునే పనిలో సర్కారు నిమగ్నమైంది. దీంతో పంచాయతీ సర్పంచులు లబోదిబోమంటున్నారు. హెల్త్ వర్శిటీ ఉద్యోగులైతే ఏకంగా వీసీపై దండెత్తారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు మాత్రం సెర్ప్ అయితేమి.. ఎల్ఐసీ అయితే ఏముందిలే అని భావించినట్టుంది.
.
గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినప్పుడు కరెంటు బిల్లుల బకాయి కింద ప్రభుత్వం జమ చేసుకుంది. అప్పుడే సర్పంచులుగా ఎన్నికైన వచ్చిన వారికి పంచాయతీల ఖాతాల్లో నగదు మాయం కావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన సుమారు రూ.3 వేల కోట్లను కూడా ప్రభుత్వం తీసేసుకుంది. దీంతో సర్పంచుల్లో ఆగ్రహం మొదలైంది. ఇటీవల కడప జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన అధికార పార్టీ సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అరకులోయలోని కొందరు సర్పంచులు అర్థనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో సర్పంచులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సోమవారం నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల సర్పంచులు జిల్లా పంచాయతీ అధికారిని నిలేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, వార్డు సభ్యులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు
ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఈ దబాయింపేందీ !
రాష్ట్ర సర్కారు గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సినవే ఇవ్వడం లేదు. గ్రంథాలయ పన్ను, వృత్తి పన్నులను పంచాయతీలకు బదలాయించాలి. ఇసుక, గ్రావెల్, గనుల సీనరేజ్ సొమ్మును పంచాయతీలకే ఇవ్వాలి. ఇవిగాక కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటును విడుదల చేయాలి. ఇవేమీ ఇవ్వకపోగా కేంద్రం తమకు నేరుగా ఇచ్చిన వాటిని కూడా ప్రభుత్వం తీసుకుంటే తామేం చేయాలని పంచాయతీల పాలకవర్గాలు వాపోతున్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టాక అనేక మంది సర్పంచులు సొంత డబ్బు వెచ్చించి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. వాటికి ఇప్పటిదాకా బిల్లులు చెల్లించలేదు. గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు ఇవ్వలేకపోతున్నట్లు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మైనర్ పంచాయతీలకు కరెంటు ఉచితంగా ఇచ్చేది. ఇప్పుడు కరెంటు చార్జీల కింద ఆర్థిక సంఘం నిధులు తీసుకోవడమేంటని సర్పంచులు కన్నెర్రజేస్తున్నారు. వివిధ శాఖల ఉద్యోగులు కూడా తాము కూడబెట్టిన సొమ్మును ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటే తమ గతేంటని నిలదీస్తున్నారు.
ఉద్యోగులు సరే.. పంచాయతీ పాలకవర్గాలు ఏంచేస్తాయో !
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు పీఆర్సీ, డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు అంశాలపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కనీసం నెలాకరున జీతం కూడా రాకుంటే తాము ఎలా బతకాలని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. ఉద్యోగుల్లో తమపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఏకరవు పెట్టారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన స్పందిస్తూ.. ఒకటో తేదీ కాకుంటే వెనుకా ముందు ఇస్తాం. ప్రభుత్వానికి ముందు పేదల సంక్షేమ పథకాలే ప్రాధాన్యమన్నట్లు వెల్లడించారు. దీంతో నవంబరు 28లోగా తమ సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని హెచ్చరించిన ఉద్యోగ సంఘాలు చల్లబడ్డాయి. సంక్షేమ పథకాలు అందుకునే ప్రజలకు తమకూ మధ్య సర్కారు అఘాతం సృష్టించే ఎత్తుగడను గమనించారు. వెంటనే సమ్మె ప్రతిపాదనను విరమించుకొని రెండు నెలలపాటు నిరసనలకే పరిమితమవుతున్నట్లు కార్యాచరణ ప్రకటించారు. ఉద్యోగులంటే వెనక్కి తగ్గారు. మరి పంచాయతీ పాలకవర్గాలు ఎలా స్పందిస్తాయో !