మూడేళ్ల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. కొత్తగా పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ప్రయోజనం ఉండడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఏవైనా సామగ్రి లేదా పరికరాలు సరఫరా చేస్తే డబ్బులు రావనే అపవాదు. ఈపాటికే చాలా సంస్థలు సరఫరా నిలిపేశాయి. ముందుగా డబ్బులిస్తేనే పంపుతామని మరి కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన పరపతిని పోగొట్టుకుంది. పనిచేస్తే డబ్బులు రావనే అపవాదును మోస్తోంది. ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన పరిస్థితులేంటీ ! అసలు ఇప్పటిదాకా ఎంత ఆదాయం వచ్చింది.. ఎన్ని అప్పులు తెచ్చారు.. దేనికి ఖర్చుపెట్టారనేది ప్రజల్లో బోలెడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీటిపై కొంత క్లారిటీ ఇచ్చేందుకు ఒకరిద్దరు ప్రయత్నించినా స్పష్టత లేదు.
నవంబరు 30తో వైసీపీ పాలన ప్రారంభమై 30 నెలలైంది. ఇప్పటిదాకా ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు ఇతర పక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినా దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులాగా ప్రభుత్వ ఆర్థిక దుస్థితి కొనసాగుతోంది. గతంలో అనేక ప్రభుత్వాలు అప్పులు తెచ్చాయి. ఇంతగా ఆర్థిక పతనాన్ని చవిచూడలేదు. ఇది కేవలం జగన్ సర్కారు పరిపాలనా వైఫల్యమేనని దుయ్యబడుతున్నాయి. ఈసందర్భంగా ఏ పథకం కింద ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను వైసీపీ నేత, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పార్టీ వెబ్సైట్లో వెల్లడించారు. సాక్షి పత్రికలో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఓ వ్యాసం రాశారు. ఆర్నెల్లు సర్దుబాట్లుంటాయి. ఏడాదిన్నర కరోనా లాక్ డౌన్ పోగా మిగతా ఆరు నెలల కాలంలోనే జగన్ పాలనను బేరీజు వేయాలని పేర్కొన్నారు.
వీటికి వివరాలిస్తే సరి..
ఇవన్నీ కాదండి. ఇప్పటిదాకా ప్రభుత్వానికి నెలకు రూ.11 వేల కోట్ల చొప్పున 30 నెలల కాలంలో రూ.3,30,000 కోట్ల రాబడి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లు లేదా మరింకే రూపంలో నిధులు వచ్చినా అవి సుమారు రూ.1,50,000 కోట్లుంటాయి. అప్పు చేసింది రూ.3.40 లక్షల కోట్లు. మొత్తంగా రూ.8.20 లక్షల కోట్లలో ప్రతి ఏటా దేనికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. ఇందులో సంక్షేమ పథకాలకు ఎంత, అప్పులకు అసలుతోపాటు వడ్డీ కిస్తీలకు కట్టిందెంత, ఉద్యోగుల జీతభత్యాలకు ఎంత ఖర్చయిందో వెల్లడిస్తే సరి. ఇందులో దాపరికం ఎందుకు ! పారదర్శకతకు తాము బ్రాండ్ అంబాసిడర్ అని మాటల్లో కాదు. ఈ పద్ధతిలో లెక్కలు వెల్లడించండి. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఎవరైనే వేలెత్తి చూపే సాహసం చేయగలరా ?
అవి కేవలం ఆరోపణలేనని తేల్చండి
ఇటీవల మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూ.1.32 లక్షల కోట్లకు లెక్కలే లేవని ఆరోపించారు. ఇక కాగ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతుందని పెద్దపెద్ద బండలు వేస్తోంది. అసలు బడ్జెట్ నే అనుసరించడం లేదని తీవ్ర ఆరోపణలు సంధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 90 శాతంలోపు వరకే హామీలిచ్చి అప్పులు తేవాలనే నిబంధనను వదిలేశారు. ఏకంగా 180 శాతం హామీలతో అప్పులు తెచ్చేందుకు అసెంబ్లీలో బిల్లు తెచ్చారు. ఇప్పటిదాకా అప్పు తెచ్చిన సొమ్మంతా సంక్షేమ పథకాలకే వెచ్చించారా.. అందులో ఆస్తుల సృష్టికి ఎంత ఖర్చుపెట్టారనే వివరాలతో నివేదిక వెల్లడిస్తే ప్రభుత్వ పారదర్శకతకు టెంకాయ కొట్టి దండం పెట్టొచ్చు. ఇవేమీ లేకుండా ఈ పథకం కింద ఇంత.. ఆ పథకం కింద అంతని లెక్కలు విడుదల చేస్తే ఏమర్థమవుతుంది సార్ ! అసలు ఇప్పటిదాకా తెచ్చిన అప్పు.. ఇక నుంచి తీసుకురానున్న అప్పును ఎప్పటిలోగా, ఎలా తీరుస్తామనేది అప్పులిచ్చిన సంస్థలకు వెల్లడించే ఉంటారు కదా ! ఆ వివరాలు కూడా ప్రజలకు వెల్లడిస్తే సముచితంగా ఉంటుంది. ఏమంటారు సార్ !