ఎప్పుడో గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లు. వాటిల్లో ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్న వాళ్లున్నారు. ప్రభుత్వానికి బాకాయి చెల్లించి పట్టా సొంతం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు ! ఆ వెసులుబాటు లేని వాళ్లు ఎందరో ఉన్నారు. నేటికీ బతుకు భారమై ఆలనాపాలనా చూసే దిక్కులేక కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛనుపై ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, ఒంటరి మహిళలు మరెందరో ఉన్నారు. వీళ్లంతా ఓటీఎస్ కింద రూ. 10 వేలు ఎక్కడ తీసుకొచ్చి కడతారు ? ఓటీఎస్ అనేది ఓ ఆప్షన్‌గా ఉండాలే తప్ప అప్పులోళ్ల మాదిరి దబాయించి వసూలు చేయడమేంటి సార్ ! దీనిపై గ్రామీణ నిరుపేదలు సర్కారు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గ్రామ సచివాలయం వలంటీర్లకు ఓ సర్కులర్ జారీ చేసింది. మండల అధికారుల ఆదేశాల మేరకు ఓటీఎస్ కింద పదివేలు చెల్లించకుంటే గురువారం ఇచ్చే పింఛను నిలిపేయాలనేది సారాంశం. మెడపై తలకాయ ఉన్నోళ్లు చేసే పనేనా ఇది ? ఎలాంటి ఆదరువు లేని వాళ్లు రూ. 2 వేలు పింఛను అందుకుంటున్నారు. అలాంటి పేదలు పదివేలు ఎక్కడ నుంచి తీసుకొచ్చి చెల్లిస్తారు ! పింఛనుకు ఓటీఎస్‌కు ముడి పెట్టడం దారుణం. అత్యుత్సాహం ప్రదర్శించారంటూ సదరు కార్యదర్శిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వం అధికారులకు టార్గెట్లు పెట్టి వత్తిడి చేయడం వల్లా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలతో అప్పులు చేయించి కట్టించుకుంటున్నారు. రేపు వాళ్లు సకాలంలో వాయిదాలు కట్టకుంటే తమ గ్రూపులు డిఫాల్టర్‌గా మారిపోతాయని మహిళలు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర సర్కారు బొచ్చె ఖాళీ అయ్యిందని ఇలా బలవంతపు వసూళ్లకు దిగడంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(వన్ టైమ్ సెటిల్మెంట్)కు ప్రధానంగా గ్రామీణ పేదల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, చేతి వృత్తులతో కాలం వెళ్లదీస్తున్న కుటుంబాల ఆర్థిక స్థితి దారుణంగా మారింది. దశాబ్దాల కిందట నుంచి ప్రభుత్వ రుణంతో కట్టుకున్న ఇళ్లు లేదా ప్రభుత్వమే కట్టించిన ఇచ్చిన ఇళ్లలో ఉంటున్నవారు ఓటీఎస్ కు స్పందించడం లేదు. ఏదో అవసరానికి తెగనమ్ముకుంటే కొనుగోలు చేసిన వాళ్లు మాత్రమే ముందుకొస్తున్నారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరాల్లో డీకే భూముల్లో ఇల్లు కట్టుకున్న వాళ్లు ఓటీఎస్‌కు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలుంటే తమ భూమికి విలువ పెరుతుందనే భావనతో అప్పులు చేసి అయినా ఓటీఎస్ సొమ్మును చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడో కట్టించిన ఇళ్లలో కాపురముంటూ పూట గడవని పేదలు మాత్రమే ముందుకు రావడం లేదు.
కరోనా లాక్ డౌన్ నుంచి ప్రజల జీవన వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. కనీస అవసరాలు ఎక్కువయ్యాయి. నిత్యావసర సరకుల ధరలు 33 శాతం పెరిగాయి. వరుసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలతో ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం దేశంలో కెల్లా అత్యధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రజలు ఏపీలోనే ఉన్నారు. అర్బన్‌లో 45 శాతం, రూరల్‌లో 35 మంది పెద్ద ఎత్తున అప్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్‌కు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ పథకాన్ని నిరుపేదలకు ఆప్షన్ ఇవ్వాలేగానీ బలవంతపు వసూళ్లకు పాల్పడితే ప్రజల నుంచి ఎదురుదాడి మొదలవుతుంది. అసలుకే మోసం వస్తుంది. అధికారులకు టార్గెట్లు పెట్టకుండా భరించగలిగిన కుటుంబాల నుంచి వసూలు చేయడం సముచితం.