ఈ నేలమిద అన్ని ఆటల్ని మింగేసిన క్రికెట్ ఇప్పుడు జనాల జీవితాలనే బెట్టింగ్ పెట్టించి మరీ ఆడుతోంది. అన్ని కళారూపాలని మింగేసిన సినిమా జనాల్ని దుస్తులిప్పేయించి నడివీధిన కుప్పిగంతులేయిస్తోంది.
చెంచు భాగోతం, భామాకలాపం, బుర్రకథ, తోలుబొమ్మలాట, వీరనాట్యం, బుట్ట బొమ్మలు, డప్పు, తప్పెట గుళ్ళు, లంబాడీ, బోనాలు, ధింసా, కోలాటం, జ్యోతి నృత్యం, ఉరుము నృత్యం, కత్తిసాము, కర్రసాము, కొమ్ము కథ, కొమ్ము బూరలు, గరగ, గరిడి, ఒగ్గు కథ, గురవయ్యలు, గొండ్లి నాట్యం, గొల్ల సుద్దుల, చెక్కభజన, యక్షగానం, చిందు, చెక్కబొమ్మలాట, జడకోలాటం, జిక్కికి, డప్పులు, పగటి వేషాలు, పల్లెసుద్దులు, పులివేషాలు, పెద్దపులి వేషం, పొంబల వాయిద్యం, మరగాళ్ళు, కొరవయ్యలు, వగ్గుడోళ్ళు, వీధి బాగోతం, వీరనాట్యం… ఇలా ఎన్నో కళారూపాల్ని, సన్నాయి, తప్పెట, డోలక్, డ్రమ్ము, సితార, బూర, గిటార్, మౌత్ ఆర్గాన్, వయలిన్, తబలా, ఫ్లూట్, వీణ, హర్మోనియం.. వంటి సంగీత పరికరాలమీద నైపుణ్యాన్ని, ఎన్నో గొంతుల్ని సాహిత్యాలనీ మింగేసిన అనకొండ సినిమా అనేది.

కమల్ హాసన్ జాలరి నృత్యం శుభసంకల్పం సినిమాలో ఆడితేనే ఒక సంపత్‌కుమార్, భీమ్లానాయక్ సినిమా కోసం పాడితేనే ఒక మొగిలయ్య ఎవరో తెలిసిరావడం మనం కోల్పోయిన కళారూపాల అవగాహనకు ఆనవాళ్లు. ఈ వాడివత్తలైపోయిన నైపుణ్యాల గురించి ఒక్క కళ గురించి గానీ, ఒక్క సంగీత వాయిద్యం గురించిగానీ, ఒక్క సాహిత్య ప్రక్రియ గురించి గానీ ప్రావీణ్యం అటుంచి కనీస అవగాహన లేని ఏలికపాములు ఈ అనకొండను ఆసరాగా చేసుకుని, తమ అనకొండకు పుట్టిన నటుడు, పాటగాడు, ఆటగాడు.. అనే ప్రతి సంతతి పోయినప్పుడెల్లా, తోకలెత్తి శోకాలు పాడతాయి. తమ విన్యాసాలని నిలబడి చూసేవాళ్లు కూడా తమతోపాటు ఎందుకేడవడంలేదని నిలదీస్తాయి.
కన్నీళ్లు విలువైనవని, వాటిని రోడ్లమీద కళ్లాపి జల్లకండని మేం నచ్చజెపుతాం! అంతే