ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్నంటారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ప్రజా సేవలో ముందుంటామని జన సైనికులు ఆచరణలో నిరూపిస్తున్నారు. ఇటీవల రాయలసీమ వరదల్లో ఎక్కడకక్కడ కదిలి ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేశారు. వాళ్ల కష్టాల్లో పాలుపంచుకున్నారు. తమ వద్ద ఉన్నదేదో ఆ అభాగ్యులకు పెట్టారు. పెద్ద పెద్ద నాయకుల్లేరు. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించలేదు. తోటి మనిషిని ఆదుకోవాలనే మనసుంటే చాలని జనసైనికులు చాటారు. ఇప్పుడు రహదారుల గుంతలపై దృష్టి సారించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో అందరికీ తెలుసు. దాదాపు మూడేళ్ల నుంచి ఎలాంటి మరమ్ముతుల్లేవు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకే ప్రాధాన్యమిచ్చింది తప్ప పాడైపోయిన రహదారులను పట్టించుకోలేదు. ఇటీవల ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2 వేల కోట్ల రుణం తీసుకుంది. దీంతో టెండర్లు పిలిస్తే ఒక్క రాయలసీమలో తప్ప మరెక్కడా కాంట్రాక్టర్లు స్పందించలేదు. ఇప్పటిదాకా చేసిన పనులకు బిల్లులు ఇస్తే టెండర్లు వేస్తామని పట్టుబట్టారు. చేతిలో డబ్బు లేకుండా పనులెలా చేయాలని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ, ఇతర రాజకీయ పక్షాల మాదిరిగా జనసేన పార్టీ కేవలం విమర్శలకే పరిమితం కాలేదు. ఎక్కడకక్కడ రోడ్ల మరమ్మతులను శ్రమదానం ద్వారా చేపడుతున్నారు. తాము తల్చుకుంటే ఏదీ అసాధ్యం కాదని ఉత్సాహంగా కదులుతున్నారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో శ్రమదానంతో ఓ రోడ్డును బాగు చేశారు. ద్వారపూడి – మండపేట మధ్య రోడ్డు గుంతలతో ప్రమాదకరంగా మారింది. సుమారు రెండు కిలోమీటర్లకు పైగా రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. మరమ్మతులు చేయడానికి నడుం బిగించారు. జనసేన పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సారధ్యంలో రోడ్డు పనులు చేపట్టారు. ఈసందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గడచిన రెండేళ్లలో బడ్జెట్లో కేటాయించిన రూ.13 వేల కోట్లు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్ల అభివృద్ధి పేరుతో తీసుకొచ్చిన అప్పులు ఎటు పోయాయని నిలదీశారు. ఏదిఏమైనా మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేగాకుండా ప్రజలతో మమేకమై శ్రమదానంతో సమస్యల పరిష్కారానికి పూనుకోవడం హర్షణీయం. రాజకీయ అనుభవం కలిగిన నాయకులు, వ్యూహకర్తలు లేకున్నా ఏదైనా చేయాలనుకుంటే ఉత్సాహంగా ఉరిమే కార్యకర్తలు ఉండడం జనసేనకు ప్లస్ పాయింట్. హ్యాట్సాఫ్ జన సైనికులూ !