మూడు రాజధానుల అంశం సమసిపోలేదు. మళ్లీ మార్చిలో కట్టుదిట్టంగా బిల్లు పెడతాం. వెనక్కి తగ్గేదే లేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులతో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి బాలినేని సమాధానమిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమని చెప్పారు. మరోవైపు హైకోర్టులో దీనిపై దాఖలైన పిటిషన్లు ఉపసంహరించుకోవడం లేదని డిఫెన్స్ లాయర్ కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా విచారణ జరపాల్సిందేనని న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వం మళ్లీ ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశముందని పిటిషనర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. దీనికి సంబంధించిన చట్టాలను ఉపసంహరించుకుంది. మరోవైపు అమరావతి రాజధాని అభివృద్ధి పేరిట గత ప్రభుత్వం ప్రపంచబ్యాంకు వద్ద ప్రతిపాదించిన సుమారు రూ. 50వేల కోట్ల రుణం ఫైలు సిద్దంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ రుణం ప్రభుత్వానికి చాలా కీలకమైంది. అందుకే ఓ అడుగు వెనక్కి వేసి ఆ రుణం కోసం పావులు కదుపుతోంది. దీనికి భిన్నంగా రాజధాని ఉపసంహరణ అఫిడవిట్లోనూ తాము మరోసారి మూడు రాజధానుల బిల్లును ముందుకు తెస్తామని పేర్కొనడంతో దీనికి వ్యతిరేకంగా కోర్టులో ఫైల్ అయిన పిటిషన్లు యథావిధిగా కొనసాగుతాయని డిఫెన్స్ లాయర్ స్పష్టం చేశారు. మంత్రి బాలినేని వ్యాఖ్యలతో ప్రభుత్వ విధానమేంటనేది మరింత తేటతెల్లమైంది.

మరోవైపు అమరావతి రాజధానిపై కేంద్ర పెద్దలు చాలా స్పష్టంగా ఉన్నారు. అమరావతి రాజధాని కోసం ఉద్యమించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు నిర్దేశించారు. అమరాతే రాజధాని అంటూ ఆ పార్టీ కూడా రైతుల మహాపాదయాత్రకు మద్దతు పలికింది. హైకోర్టులో న్యాయ పరంగా మూడు రాజధానుల బిల్లు నిలబడదని తెలిసి ప్రభుత్వం వెనకడుగేసింది. మళ్లీ మార్చిలో బిల్లు పెడతామని మంత్రి బాలినేని ప్రకటించడంతో రాజధాని అభివృద్ధి రుణం ఎలా వస్తుంది ! కేంద్ర పెద్దల మాటను పెడచెవిన పెడతారా ! లేక కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ తలపడతారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సీఎం జగన్కు బంధువు, సన్నిహితంగా ఉండే బాలినేని మాటలను తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు.
తాజాగా పంచాయతీలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడాన్ని తప్పుపట్టింది. పంచాయతీలు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరవాలని సూచించింది. బ్యాలెన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా సదరు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి తల కొట్టేసినంత పనైంది. నాడు కేంద్రం జోక్యంతో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసిన దానికి సంబంధించి సుమారు రూ.6 వేల కోట్లు రావాలి. ఈ సొమ్ము ఇప్పించాలని కేంద్రాన్ని అడిగితే మీరూమీరూ తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఏమైనా సరే కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.