ఓటీఎస్‌పై రాష్ట్ర సర్కారు స్థిర నిర్ణయంతో ముందుకెళ్తోంది. ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే వెనకడుగు వేయకూడదని కృత నిశ్చయంతో ఉంది. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈపాటికే పాత ఇళ్లు చేతులు మారి ఉంటాయి. పేదలు తమ అవసరాల కోసం ఎప్పుడో తెగనమ్మేసుకొని ఉంటారు. నేడు ఆ ఇళ్లలో ఉంటున్నవాళ్ల నుంచి పెద్దగా అభ్యంతరాల్లేవు. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడెప్పుడో ప్రభుత్వ సాయంతో కట్టుకొని అదే ఇంట్లో నివసిస్తున్న కుటుంబాలే ఆసక్తి చూపడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలు ముందుకు రావడం లేదు.
ప్రభుత్వ పెద్దలు ఈ పథకాన్ని బలవంతంగా రుద్దడం లేదని చెబుతున్నారు. వాళ్లకిష్టమైతేనే ఓటీఎస్ తీసుకోవచ్చంటోంది. అధికార యంత్రాంగంపై వత్తిడి మాత్రం ప్రజలను వెంటపడి తరుముతోంది. ఈ పథకం అమలుపై ప్రభుత్వానికి బోలెడు చిక్కులు తప్పేట్లు లేవు. హౌసింగ్ బోర్డు రుణంతో కట్టుకున్న ఇంట్లో ప్రస్తుతం అదే కుటుంబం ఉంటుంటే ఇబ్బంది లేదు. స్టాంప్ పేపర్స్‌పై రాయించుకొని కొనుగోలు చేసుకున్న వాళ్లతో ప్రభుత్వం ఓటీఎస్ కట్టించుకుంటోంది. భవిష్యత్తులో దీనిపై పట్టాదారుడు తిరగబడితే ఏం చేస్తారు !

డీకే పట్టాల్లోని స్థలం లేదా ఇల్లు క్రయవిక్రయాలు జరపకూడదనే నిబంధన ఉంది. దీని ప్రకారం అసలు పట్టాదారుడికి నోటీసులు ఇవ్వకుండా ముందుకెళ్తే న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. సహజంగా డీకే పట్టా పొందిన స్థలంలో ఇల్లు కట్టుకోకుంటే ఆర్నెల్ల తర్వాత ఆటోమేటిగ్గా పట్టా రద్దవుతుంది. అదే ఇల్లు నిర్మించి ఉంటే మాత్రం ఇంటి ఓనరుకు నోటీసులు ఇవ్వాలి. ఈప్రక్రియ చేపట్టకుండా ఎవరైతే ప్రస్తుతం ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్లతో ఓటీఎస్ కింద డబ్బు కట్టించుకుంటే భవిష్యత్తులో వాళ్లూవాళ్లూ జుట్టులు పట్టుకోవాల్సివస్తుంది. వీటన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అందుకు తగ్గ చట్ట సవరణలు చేయాలి.
మరోవైపు ప్రతిపక్ష టీడీపీ నేతలు ఓటీఎస్ కింద నగదు చెల్లించవద్దనే ప్రచారం అందుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా రిజిస్టర్ చేస్తామని చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలను కొల్లగొడుతుందని విమర్శలు సంధిస్తున్నారు. 1983 నుంచి పేదలకు కట్టించిన ఇళ్లకు సంబంధించి ఈ ప్రభుత్వానికి డబ్బు ఎందుకు చెల్లించాలని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. ఓటీఎస్ కింద రిజిస్ట్రేషన్ పత్రాలు పొందడం ద్వారా అవసరమైతే బ్యాంకు రుణాలు పొందొచ్చు. ప్రస్తుతం స్థలాల విలువ పెరిగినందున ఇది ప్రయోజనకరమని అధికార పార్టీ నేతలు ప్రజలను ఒప్పిస్తున్నారు. ఈ పథకం కింద లబ్దిదారుడు నగదు చెల్లించి పత్రాలు పొందిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే భరోసా ఇస్తే బావుంటుంది. ఆ కోణంలో ప్రజల్లో అవగాహన కల్పించాలి.