“ మాది రైతు ప్రభుత్వం. రైతుల అభివృద్ధే ధ్యేయం. రైతుల తర్వాతనే మాకెవరైనా. రైతు బంధు, రైతు భరోసా ఇస్తున్నాం. సున్నా వడ్డీ పంట రుణాలు, యాంత్రీకరణ సబ్సిడీ ఇస్తున్నాం. రైతుల దగ్గర పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే కనీస మద్దతు ధరకు కొంటున్నాయి. మా రైతులంతా సుభిక్షంగా ఉన్నారు !” రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పెద్దలు నోరుతెరిస్తే మొట్టమొదట వచ్చే మాటలు ఇవి. నేతల మాటల్లోని డొల్లతనాన్ని మొన్న కేంద్ర సర్కారు బయటపెట్టింది. దేశ వ్యాప్తంగా అప్పుల్లో కూరుకుపోయిన రైతు కుటుంబాలపై సర్వే చేస్తే.. మొదటి స్థానంలో ఏపీ, రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. 93.2 శాతం ఏపీలో, 91.7 శాతం తెలంగాణలో రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లు వెల్లడించింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.52 లక్షల అప్పున్నట్లు తేల్చింది. సగటున నెలకు రూ.9 వేలు ఆదాయం వస్తున్నట్లు నిర్ధారించింది. మీ మాటలు అబద్దమా.. కేంద్రం లెక్కలు అసత్యమా ?
“అసలు ఇంతగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి దారితీస్తున్న అంశాలపై ఏనాడైనా దృష్టి పెట్టారా ! ఎక్కడ నష్టపోతున్నారు.. ఎంతెంత నష్టపోతున్నారనే కారణాలను కనుగొన్నారా ! ఓ రైతు కుటుంబ జీవనానికి అయ్యే వ్యయమెంత ! ఎంత ఆదాయం పొందుతున్నాడు ! అందులో ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతారణ పరిస్థితుల ప్రభావమెంత ? పంటల బీమా పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా ! పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులను ప్రభుత్వం సమకూరుస్తుందా ! కనీస మద్దతు ధరలు రీజనబుల్‌గా ఉన్నాయా ! ఆమేరకు పంట కొనుగోలు జరుగుతుందా?” అనే అంశాలు ముందుకొస్తున్నాయి. అంతకన్నా ముందు అసలు రైతు అంటే ఎవరు ! భూమి కలిగిన వాళ్లా.. పంట పండించేవాళ్లా ! భూమి కలిగి ఉండి వ్యవసాయం నుంచి తప్పుకున్న కుటుంబాలెన్ని ! సెంటు భూమి లేకున్నా కౌలుసాగు చేస్తున్నవాళ్లు ఎంత మంది ! వాళ్లకు ప్రభుత్వం నుంచి అన్ని ప్రోత్సాహకాలు అందుతున్నాయా అనే మౌలిక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

ఉదాహరణకు ఏపీలో రైతు కమతాల తీరును పరిశీలిస్తే.. సుమారు 60 లక్షల కుటుంబాలు పంటల సాగులో ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందులో 52 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.13.500 చొప్పున రైతు భరోసా కింద ఇస్తోంది. సున్నా వడ్డీకి పంట రుణాలు, యాంత్రీకరణ సబ్సిడీ నగదును అందజేస్తోంది. ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరిస్తోంది. మద్దతు ధరలను అమలు చేస్తున్నట్లు చెబుతోంది. వాస్తవానికి సెంటు భూమిలేకుండా కేవలం కౌలు సాగు చేపట్టే రైతులు సుమారు 18 లక్షల మంది ఉంటారు. కొంత భూమి ఉండి మరికొంత కౌలుకు తీసుకునేవాళ్లు పది లక్షల మంది ఉన్నారు. అంటే మూడింట రెండొంతులు కౌలు సాగు నడుస్తుంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలన్నీ ఎవరికి చేరుతున్నాయి ?
ఇటీవల వ్యవసాయమంత్రి కన్నబాబు తాము కౌలు రైతులకూ సాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అసలు కౌలు రైతులుగా నమోదు అయ్యిందే ఆరు లక్షల మంది ఉంటారు. ఈ –క్రాప్‌లో ఎంతమంది కౌలు రైతుల పేర్లు నమోదయ్యాయి.. ఎంత మంది భూ యజమానులు ఇందుకు సహకరించారనేది చూస్తే.. ఇందులోనూ అవకతవకలే. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో సుమారు 420 మంది కౌలు రైతులుంటే అందులో పదో శాతం కూడా రికార్డులకెక్కలేదు. భూయజమానుల బంధువులు, అమెరికా, బెంగళూరులో ఉండే స్నేహితులు కౌలు రైతులుగా నమోదయ్యారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా ! అసలు పంట సాగు చేసే రైతునే గుర్తించని ప్రభుత్వానికి అసలు రైతుల క్షేమం గురించి మాట్లాడే అర్హత ఉందా ! ప్రభుత్వం గుర్తించిన కౌలు రైతుల బాపతులో 90 శాతం ఇలాగే నమోదయ్యారు. ఏపీ కౌల్దారీ చట్టమే పరమ లోపభూయిష్టంగా ఉంది.

రాష్ట్రంలో ఆహార పంటల సాగును ప్రభుత్వం నిరుత్సాహపరుస్తోంది. ఇవి సాగు చేసేది ఎక్కువగా కౌలు రైతులే. ఒకప్పుడు ఆహార పంటల సాగులో ఇంటిల్లపాదికీ ఉపాధి లభించేది. యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో ఈ పంటల సాగు కూడా జూదంలా మారింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటల దిగుబడి తగ్గడం, పెట్టుబడులు పెరుగుతున్నాయి. పంటల బీమా కౌలు రైతులకు వర్తించదు. మిగతా రైతులకూ బీమా సొమ్ము చెల్లింపుల్లో అనేక మెలికలున్నాయి. బీమా కంపెనీల నిబంధనలు, పంటల సాగు సమయం విషయంలో అనేక తేడాలున్నాయి. రైతువారీ ప్రీమియం కట్టించుకుంటూ మండలాల వారీ నష్టాన్ని లెక్కేస్తారు. పంట ఎంత శాతం నష్టపోయారనేది ఎప్పటికప్పుడు లెక్కించే విధానం లేదు. ఇక వాణిజ్య పంటలు నష్టపోతే ఆ రైతు ఆత్మహత్యకు దారితీస్తోంది. భారీ పెట్టుబడులతో కూడుకున్న పంటలను బొమ్మా బొరుసా అంటూ వర్షాధారం సాగు చేయాల్సివస్తోంది.
ఆహార, వాణిజ్య పంటలు సాగు చేస్తోన్న కౌలు రైతులకు సంస్థాగత రుణాలు అందడం లేదు. ఎరువులు, పురుగుమందుల డీలర్లు, మిల్లర్ల నుంచి అధిక వడ్డీలకు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాల్సివస్తోంది. పంట నష్టం జరిగితే పరిహారం అందదు. తీరా పంట పండిన తర్వాత మిల్లర్లు, ఎరువుల డీలర్లే పంటను కొనుగోలు చేస్తారు. అదీ వాళ్ల చెప్పిన ధరకే. ఇంకా నాణ్యత లేదనే పేరిట ధరలు దిగకోస్తారు. తూకాల్లో తరుగు తీసుకుంటారు. తర్వాత పెట్టుబడి మినహాయించుకొని మిగిలితే ఇస్తారు. లేకుంటే రావాల్సిన బకాయికి మళ్లీ ప్రాంసరీ నోటు రాయించుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతున్న తీరు ఇదే. ఈ చైన్‌ను తెగ్గోట్టేందుకు ప్రభుత్వం సిద్దపడడం లేదు. ఎందుకంటే ఇక్కడ దళారుల పాత్ర పోషించేది రాజకీయ పార్టీలతో దగ్గర సంబంధాలున్నవాళ్లే.
అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఏ ప్రాంతంలో ఏ పంట పండించాలనేది ముందుగా నిర్దేశించాలి. ఎవరు సాగు చేస్తున్నారో కచ్చితంగా గుర్తించాలి. రైతు భరోసా కేంద్రాల్లోనే సాగు రికార్డులు ఉండాలి. ముందుగానే ఏ పంటను ఎంతకు కొనుగోలు చేస్తారనేది ప్రకటించాలి. స్వామినాథన్ సిఫారసుల మేరకు పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను నిర్ణయించాలి. సాగుకు కావాల్సిన పెట్టుబడులు, ఎరువులు, క్రిమిసంహారక రసాయనాలు, పరికరాలు ఆర్బీకే నుంచే అందించాలి. పంట సాగు సమయంలో అతివృష్టి, అనావృష్టికి నష్టం వాటిల్లిన వెంటనే పరిహారం పొందేట్లు బీమా కంపెనీల నిబంధనలు ఉండాలి. పంట మొత్తాన్ని ప్రభుత్వామే కొనుగోలు చేయాలి. అప్పుడు రైతు భరోసాలు, సున్నీ వడ్డీ పథకాలు అవసరం లేదు. అప్పుల పాలయ్యే అవకాశమే లేదు. వ్యవసాయమనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఉమ్మడి అంశం. ఇవన్నీ అమలుచేసే దమ్ము ఈ ప్రభుత్వాలకు ఉందా !