ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేత బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. “ప్రభుత్వాన్ని నిలపగలం.. కూల్చేయగలం ” అనేంతగా ఉద్రేకం ఎందుకొచ్చిందనేది ఉద్యోగుల్లో నలుగుతున్న విషయం. వైసీపీ శ్రేణులైతే చంద్రబాబే మాట్లాడించి ఉంటారని కారాలు మిరియాలు నూరుతున్నారు. టీడీపీ వాళ్లు బుద్దొచ్చిందా అంటున్నారు. నాడు చంద్రబాబుకు ద్రోహం చేసినందుకు అనుభవించండనే శాపనార్థాలు పెడుతున్నారు. వాస్తవానికి ఉద్రేక పడాల్సిన సమస్య లేదా అంటే ఉందనే చెప్పుకోవాలి. అవి బండి శ్రీను గొంతులో నుంచి వచ్చిన మాటలు కావు. గుండెల్లో నుంచి తన్నుకొచ్చిన ఆక్రోశమే.
వాస్తవానికి ప్రభుత్వాధినేతలకు ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఎన్నిమాటలతూటాలు పేలినా అవి టీ కప్పులో తుఫాను మాదిరిగా సమసిపోయేవి. వెంటనే చర్చోపచర్చలు కొనసాగేవి. ఉద్యోగుల డిమాండ్లు ఎన్ని ఉన్నా ప్రభుత్వ పెద్దలు ఏదో బుజ్జగించి వాళ్లు ఇవ్వాలనుకునేది ప్రకటించేది. ఇది గత చరిత్ర. వైసీపీ సర్కారు వచ్చాక పరిస్థితులు తల్లకిందులయ్యాయి.
ఉద్యోగ సంఘాల నేతలతో సామరస్యంగా చర్చించి సీఎం జగన్‌తో ఒప్పించే సాఫ్ట్ స్కిల్స్ ఉన్న నేతలు కరువయ్యారు. ప్రస్తుతం సీఎం కోటరీ చుట్టూ ఉన్నోళ్లంతా భజన బృందాలే. ఒక్కరికీ సలహాలు ఇచ్చి ఒప్పించే స్థాయి లేదు. సీఎం కూడా అలాంటి అవకాశం ఎవరికీ ఇచ్చినట్టు లేదు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. దీనికి తోడు ఉద్యోగ సంఘాల్లోనే కులాలను ముందుకు తోసి చీలికలకు ప్రయత్నాలు జరిగాయి. ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన ఉద్యోగ సంఘాలకు ఇది అసలు మింగుడు పడలేదు.

ఇటీవల సీఎం జగన్ నెల్లూరు జిల్లా వరద బాధితులను పరామర్శిస్తుండగా ఎవరో పీఆర్సీ గురించి అడిగారట. దానిపై ఆయన వెంటనే స్పందించి వారం పదిరోజుల్లోపు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇది ఉద్యోగ సంఘాల నేతలకు మరింత తల తీసేసినట్లుంది. గతానికి భిన్నంగా పీఆర్సీ గురించి వరద ప్రాంతాల పర్యటనలో ఉన్నప్పుడు సీఎంను ఓ ఉద్యోగి అడగడమేందో.. దానికి ఆయన సమాధానం ఇవ్వడం ఏంటో రొటీన్‌కు భిన్నంగా ఉంది.
దాదాపు మూడు పీఆర్సీలు పెండింగులో ఉన్నాయి. మరో ఐదు డీఏలు ఇవ్వలేదు. కరోనా లాక్డౌన్ ప్రభావం ఉద్యోగులపైనా ఉంది. ఆర్థిక అవసరాలు పెరిగాయి. వీటన్నింటికీ తోడు ఒకటో తేదీన ప్రభుత్వం జీతం ఇవ్వలేని దుస్థితికి చేరింది. లోన్ పెట్టుకుంటే రాదు. పీఎఫ్ నగదు డ్రా చేసుకునేందుకు బిల్లు పెడితే ఎప్పుడొస్తుందో తెలీదు. అరియర్స్ గురించి అసలు మర్చిపోయారు. వివిధ అవసరాలకు చేసిన అప్పులకు నెల ఒకటో తేదీన చెల్లించాల్సిన వాయిదాలు కట్టలేకపోతున్నారు. దీంతో పెనాల్టీలు పడుతున్నాయి. పరువుపోతోంది.
ఆందోళనలు, పోరాటాలతోనే రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకుంటామనే ధోరణిలో ఉద్యోగ సంఘాలుంటాయి. ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడి లేమని చెబుతుంటాయి. తాము ఇన్ని రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నా, వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా స్పందించని సీఎం ఎక్కడో వరద ప్రాంతాల్లో ఎవరో అడిగారని బదులివ్వడాన్ని తప్పుబడుతున్నార. పీఆర్సీ ఎంత శాతమిస్తారనే దానికి సంబంధించి జాయింట్ కౌన్సిల్ సమావేశంలో ఉన్నతాధికారులు నివేదికను సమర్పించాలి. దీనిపై చర్చలు జరగాలి. తర్వాత ఓ నిర్ణయానికి రావాలి. దీనికి భిన్నంగా అధికారులు ఉద్యోగ సంఘాల నేతలకు నివేదిక ఇవ్వలేదు. దీంతో మరింత అసహనానికి గురయ్యారు.
సహజంగా ప్రభుత్వ ఉద్యోగులంటే తాము సమాజంలో సగటు పౌరులకన్నా ఎక్కువనే భావనలో ఉంటారు. సామాన్య ప్రజలు కూడా వాళ్లకేం ప్రభుత్వ ఉద్యోగులు. ఒకటో తేదీన జీతం తీసుకుంటారు. అందరికన్నా మెరుగైన జీవితం గడుపుతుంటారని భావిస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రతిష్ట దెబ్బతిన్నది. సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారు. చివరకు పాలు పోసేవాళ్లు, కిరాణా కొట్టు వ్యాపారి ఏంటీ మీక్కూడా జీతాలు రాలేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే తలదించుకుంటున్నారు. ఇవన్నీ ఉద్యోగులు, ఆయా సంఘాల నేతల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికైనా సీఎంవో జోక్యం చేసుకొని ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్లాలి. చర్చల ద్వారా సమస్య సామరస్యంగా పరిష్కారమయ్యేందుకు సీఎం జగన్ చొరవ చూపాలి.
Better to negotiate to the early settlement of the issue. But Government employees must be made to send their children to the Government schools, they must be made to go to the Government hospitals.