వైసీపీ సర్కారు ప్రకటించిన బంపర్ ఆఫర్ ఓటీఎస్‌కు స్పందన బాగానే ఉంది. ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు లేని కుటుంబం అందరికంటే ముందే క్యూలో నిలుస్తోంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నవాళ్లు తప్పదన్నట్లు అప్పోసప్పో చేసి పత్రాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఓటీఎస్ కట్టకుంటే తర్వాత వచ్చే పథకాలు ఎక్కడ నిలిపేస్తారోననే ఆందోళనతో అయిష్టంగానైనా కొందరు తలూపుతున్నారు. మరికొందరైతే టీడీపీ వాళ్లు ఇంకా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేయలేదా అని వాకబు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించే ప్రతీ పథకం, జీవోలపై పిల్ వేసే ప్రతిపక్ష టీడీపీకి ఏమైందంటూ ఎదురు చూసే వాళ్లూ ఉన్నారు.
ఇటీవల బీజేపీ నేత సోము వీర్రాజు ఓ సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు హయాంలో కేంద్రం బలహీన వర్గాల ఇళ్ల కోసం రూ.పదివేల కోట్లు ఇచ్చినట్లు సెలవిచ్చారు. కేంద్రం ఇచ్చిన సొమ్ముతో కట్టిన ఇళ్లకు వైసీపీ సర్కారు డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇక ఆ తర్వాత ఆ పార్టీ వాయిస్ ఎక్కడా వినిపించలేదు. నాయకులెవరూ స్పందించలేదు. మిత్రపక్షమైన జనసేన ఓటీఎస్‌ను విమర్శిస్తోంది. అసలే పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఈ బాదుడేంటని నిలదీస్తోంది. ఇంకా కాంగ్రెస్, సీపీఐ నేతలూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం డబ్బు ఎలా వసూలు చేస్తుందంటూ నిందిస్తున్నారు.
వన్ టైమ్ సెటిల్మెంటుపై తెలుగుదేశం పార్టీ నిన్నటి నుంచి ఆందోళనకు దిగింది. ఆ పార్టీ శ్రేణులు దాదాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజలు ఓటీఎస్ పథకానికి నగదు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. తాము అధికారానికి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తామంటున్నారు. పేదల గృహ నిర్మాణానికి గత ప్రభుత్వాలు ఇచ్చిన సాయాన్ని వైసీపీ సర్కారు వసూలు చేయడమేంటని కన్నెర్రజేస్తున్నారు. వివిధ పథకాల పేరుతో పేదలకు ఇచ్చిన సొమ్మును తిరిగి లాక్కుంటుందని ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని భయపెడుతూ పేదల నుంచి రూ.4,800 కోట్లు వసూలు చేయడానికి పన్నాగం వేసినట్లు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 22ఏ చట్టానికి సవరణ చేసింది. న్యాయపరంగా ఎక్కడా చిక్కుల్లేకుండా 83వ నంబరు జీవో జారీ చేసింది. ఇప్పటిదాకా పేదలు పట్టా చేతిలో లేని కారణంగా అవసరాలకు ఇంటిపై అప్పు తీసుకునే అవకాశం లేదు. పది వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ పత్రాలు పొందితే తాకట్టుకు అవకాశముంటుంది. ఎవరికైనా విక్రయించుకోవచ్చు. ఇల్లు, జాగా విలువ పెరుగుతుంది. చట్టపరంగా ఇల్లు తమదనే ఓ భరోసా ఉంటుందని ప్రభుత్వ యంత్రాంగం లబ్దిదారులను ప్రోత్సహిస్తోంది. పథకం అమలులోనూ కొన్ని చిక్కులున్నాయి.
ఓ కుటుంబంలో కాలం చెందిన తండ్రి పేరున రెండు అంతస్తులున్న ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములుంటే ఎవరి పేర రిజిస్టర్ చేస్తారు ! ఇద్దరికీ కలిపి రిజిస్టర్ చేస్తారా ! స్టాంప్ పేపర్లతో అగ్రిమెంటుపై కొనుగోలు చేసుకున్న కుటుంబం రిజిస్టర్ చేసుకుంటే.. అంతకముందు డీకే పట్టా పొందిన వాళ్ల వారసులు కోర్టుకు వెళ్లకుండా ఏవైనా జాగ్రత్తలు తీసుకున్నారా ! కనీసం వాళ్లకు నోటీసులు జారీ చేశారా అనే అంశాల్లో క్లారిటీ ఇవ్వాలి. వీటిపై అధికారులు లబ్దిదారుల్లో అవగాహన కల్పించాలి. గతంలో ప్రభుత్వం జారీ చేసే జీవోలపై ఒంటి కాలిమీద న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసే ప్రతిపక్షం ఈసారి స్పందించలేదంటే.. జీవో పకడ్బందీగా ఉన్నట్లే మరి.