శ్రీవారి ఆస్తులపై టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేత పత్రం విడుదల చేశారు. ఎక్కడెక్కడ.. ఏమేం ఆస్తులన్నాయనేది వెల్లడించారు. అందరికీ సంతోషమే. అదే చేత్తో ఆ దేవదేవునికి కళ్లూ, ముక్కూ, చెవులై సేవలందిస్తోన్న ఉద్యోగుల స్థితిగతులపై కూడా ఓ శ్వేత పత్రం విడుదల చేస్తే అంతా హర్షిస్తారు. టీటీడీకి తెల్ల ఏనుగుల్లా ఎవరున్నారు.. ఎవరు రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.. ఎవరు ఎంతెంత వేతనాలు పొందుతున్నారు.. వాళ్ల స్థితిగతుల గురించి శ్వేత పత్రం వెల్లడించాలని టీటీడీ ఉద్యోగులు కోరుకుంటున్నారు. చాకిరి ఒకరిది.. అనుభవించేది మరొకరనే అపోహలు తొలగాలంటే దీనిపై ఓ నివేదిక వెల్లడిస్తే భక్తులంతా తెలుసుకుంటారు. యాజమాన్యం పారదర్శకతకు పెద్దపీట వేస్తుందని కొనియాడతారు. ఇవన్నీ వదిలేసి తమకు ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలని అడుగుతున్న కార్మిక నేతలను సస్పెండ్ చేయడమేంటీ !
దాదాపు పది రోజులపాటు వర్షం, చలిలో ఏడుకొండలస్వామి దయకోసం పరితపించారు. 2019లో చేసిన తీర్మానం మేరకు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కటిక నేలపై పడుకొని ఆందోళన చేశారు. కాంట్రాక్టర్ల వ్యవస్థ తొలగించి కార్మికులను టీటీడీ అవుట్ సోర్సింగ్ విభాగంలో కలపమని విజ్ఞప్తి చేశారు. అసలు శ్రీవారికి సేవలందించే కార్మికులకు టీటీడీకి మధ్యలో ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఎందుకనే ప్రశ్న ఉదయిస్తోంది. టీటీడీ కాంట్రాక్టర్లకు చెల్లించే దాంట్లో సగం కూడా తమకు దక్కడం లేదని ఎఫ్ఎంసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపాటికే కొందరు టైమ్ స్కేలు తీసుకుంటున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వాళ్ల సర్వీసును బట్టి రెగ్యులర్ చేయాల్సింది పోయి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో కలుపుతామనడం సబబేనా !
మొత్తం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్ని రకాల సేవలందించే ఉద్యోగులు మొత్తం సుమారు 24 వేల మంది ఉన్నారు. అందులో మూడొంతుల శ్రమ చేసేది సుమారు 15 వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులే. వీళ్లు పొందుతున్న వేతనాలెంత.. చేస్తున్న చాకిరీ ఎంతో లెక్కగట్టాలి. ఆ భగవంతుడికి సేవలు చేయడంలో తరతమ బేధాలెందుకు ! కాంట్రాక్టు ఏందీ.. శాశ్వత ఉద్యోగులేంటీ అని ఒకప్పుడు గౌరవ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. సమాన పనికి సమాన వేతనం ఉండాలన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు టైమ్ స్కేలు వర్తింపజేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీనిచ్చారు. ఆమేరకు టీటీడీ యాజమాన్యం తీర్మానం కూడా చేసింది. ఆ తీర్మానాన్ని అమలు చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారు ! ఎందుకు తాత్సారం చేస్తున్నారనేది ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు దీనికి సమాధానం చెప్పకపోగా ఆందోళన చేయడం తప్పన్నట్లు ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం న్యాయమేనా ! ఇది ధర్మమేనా !
శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో సేవలందించే ఉద్యోగులంతా సమానమే. నిత్య గోవిందనామ స్మరణతో భక్తులకు సేవ చేసుకోవడంలో తరిస్తోన్న ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లోకి ఒక్కసారి తొంగి చూడండి. చాలీచాలని వేతనాలతో ఎన్ని కుటుంబాలు నరకవేతన అనుభవిస్తున్నాయో తెలుస్తుంది. బిడ్డల భవిష్యత్తును కూడా ఫణంగా పెట్టి వెట్టి చాకిరీ చేస్తున్నా ఆ భగవంతుడు తమ పట్ల ఎందుకు నిర్దయగా ఉన్నాడని విలపిస్తున్నారు. ఏళ్ల తరబడి చేస్తున్నా కొంచెం కూడా పెరగని వేతనంతో అప్పులపాలవుతున్నారు. అవి తీర్చలేక కుమిలిపోతున్నారు. ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ అమలు చేయాలి. సర్వీనును బట్టి రెగ్యులర్ చేయాలి. ఎఫ్ఎంసీ కార్మికులను కాంట్రాక్టర్ల చెర నుంచి విముక్తి కల్పించి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో విలీనం చేయాలి. ఇటీవల వరద బాధితుల్ని పరామర్శించడానికి సీఎం వచ్చినప్పుడు ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కలిస్తే తప్పకుండా హామీ నెరవేరుస్తామని చెప్పారు. కనీసం సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటకు విలువిచ్చి అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించాలి.